రాజస్థాన్‌లోని కోటాలో భర్తతో కలిసి స్కూటీపై ఆలయానికి వెళ్తున్న మాజీ మహిళా కౌన్సిలర్ రేణు నర్వాలా, మున్సిపల్ కార్పొరేషన్ డంపర్ (టిప్పర్ లారీ) చక్రాల కింద నలిగి మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
స్కూటీ నడుపుతున్న ఆమె భర్త ధన్‌రాజ్ నర్వాలా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన చేయి విరగడంతో పాటు ముఖానికి బలమైన గాయాలైనట్లు సమాచారం.
భార్యాభర్తలిద్దరూ కలిసి గణేష్ ఆలయ దర్శనానికి వెళ్తుండగా, రోడ్డు పక్కన నడుస్తున్న ఓ మహిళను దాటే క్రమంలో స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయింది. ఆ సమయంలో రేణు నర్వాలా రోడ్డుపై పడగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ డంపర్ ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డంపర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, స్థానికులు అతడిని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రేణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, గాయపడిన ఆమె భర్తను చికిత్స కోసం చేర్పించారు.
కాగా, మున్సిపల్ డంపర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రేణు మామ ఆరోపించారు. అంతేకాకుండా, ఆ వాహనానికి ఇన్సూరెన్స్ గడువు ముగిసినప్పటికీ రోడ్లపై తిప్పుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో పాటు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దైవ దర్శనానికి వెళ్లిన మాజీ కౌన్సిలర్ ఇలా దుర్మరణం చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply