అంబాలా నగరంలో మూడు చక్రాల సైకిల్‌పై భిక్షాటన చేసుకునే లేఖరాజ్ అనే దివ్యాంగ వృద్ధుడి మరణం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
గత 10 ఏళ్లుగా హనుమాన్ దేవాలయ ద్వారం వద్ద భిక్షాటన చేస్తున్న ఆయన, ఇటీవల అనారోగ్యంతో రోడ్డుపై పడిపోగా.. ‘వందేమాతరం’ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆయన్ను చేరదీసి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఆ స్వచ్ఛంద సంస్థ సభ్యులే అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఆయన మరణం తర్వాత పోలీసులు ఆయన వాడుతున్న ఒక పెట్టెను తనిఖీ చేయగా, అసలు విషయం బయటపడింది. ఆ వృద్ధుడు ఒక లక్షాధికారి అని తేలింది. ఆ పెట్టెలో సుమారు ₹66,000 నగదు మరియు రెండు బ్యాంక్ పాస్‌బుక్కులు లభించాయి. ఆ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా అందులో ₹3 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు విచారణలో తేలింది. ఒక భిక్షగాడిగా జీవించిన వ్యక్తి వద్ద ఇంత పెద్ద మొత్తం ఉండటం అందరినీ విస్తుపోయేలా చేసింది. ప్రస్తుతం ఆ డబ్బును పోలీసులు ట్రెజరీలో భద్రపరిచారు.
