గుప్తనిధుల కోసం కన్నతల్లిని బలి ఇచ్చేందుకు ఓ పాపాత్ముడైన కొడుకు సిద్ధపడిన దిగ్భ్రాంతికర ఘటన చామరాజనగర్ తాలూకాలోని సాగడె గ్రామంలో జరిగింది. మే 1న పూర్ణిమ (హుణ్ణిమె) సందర్భంగా నరబలి ఇస్తే గుప్తనిధి లభిస్తుందని నమ్మిన కొండయ్యన మాదశెట్టి, కళ్లు కనిపించని, చెవులు వినబడని తన 80 ఏళ్ల వృద్ధ తల్లి మాదమ్మశెట్టిని బలి ఇచ్చేందుకు స్కెచ్ వేశాడు.
బుధవారం ఉదయం తన ఇంట్లోనే 4 అడుగుల గొయ్యి తవ్వి, మాంత్రిక పూజల కోసం కుండలు పెట్టి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ మరియు కలశం ఉంచి పూజలు నిర్వహించాడు. దీనిపై అనుమానం వచ్చిన చుట్టుపక్కల నివాసితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకోగానే మాంత్రికుడు తప్పించుకోగా, నిందితుడు మాదశెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుప్తనిధి కోసం క్షుద్రపూజలు చేసిన విషయం తెలిసి సాగడె గ్రామస్తులు హడలిపోయారు. చామరాజనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది.
