గురుగ్రామ్‌లోని సోహ్నా రోడ్డులో టాక్సీ డ్రైవర్లు ఒక పాఠశాల విద్యార్థినిని చుట్టుముట్టి వేధించారు. భయంతో ఆ బాలిక కారులో తనను తాను లాక్ చేసుకుని తల్లికి ఫోన్ చేసింది. బాలిక తల్లి సంఘటనా స్థలానికి చేరుకున్నాక పోలీసులకు 20 సార్లకు పైగా కాల్ చేసినా, సకాలంలో సహాయం అందలేదు.
ఒక కారు మరియు టాక్సీ ఢీకొనడంతో ఈ గందరగోళం మొదలైంది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కారులో ఉన్న మైనర్ బాలికను టాక్సీ డ్రైవర్లు చుట్టుముట్టారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా, అరగంట వరకు పోలీసులు అక్కడికి చేరుకోలేదు.
కారు డ్రైవర్‌పై దాడి
బాధితురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గొడవ సమయంలో టాక్సీ డ్రైవర్లు కారు డ్రైవర్‌పై భౌతిక దాడికి దిగారు. అక్కడున్న టాక్సీ డ్రైవర్లు కారును చుట్టుముట్టి, పదే పదే తలుపులు తీయడానికి ప్రయత్నించారు. ఈ భయంతోనే విద్యార్థిని కారు లోపల లాక్ చేసుకుని, ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పింది. “నా కూతురు సాయంత్రం 5:02 గంటలకు పోలీసులకు మొదటి ఫోన్ చేసింది. ఆ తర్వాత 5:10 గంటలకు పోలీసులు ఫోన్ చేసి లొకేషన్ అడిగారు. ఎంతకీ సహాయం అందకపోవడంతో తను నాకు వీడియో కాల్ చేసి విషయం చెప్పింది” అని తల్లి వివరించారు. తాము పోలీస్ కంట్రోల్ రూమ్‌కు 20 సార్లకు పైగా కాల్ చేసినా, సుమారు 37 నిమిషాల తర్వాతే పోలీస్ బృందం అక్కడికి చేరుకుందని ఆమె ఆరోపించారు.
డ్రైవర్‌కు 2 వేల రూపాయలు ఇచ్చిన తల్లి
సంఘటన తర్వాత, డబ్బులు ఇచ్చి రాజీ పడాలని విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక ఆ డ్రైవర్‌కు 2 వేల రూపాయలు కూడా ఇచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “10 నిమిషాల్లో డెలివరీ అయిపోతోంది కానీ, పోలీసులు రావడానికి 37 నిమిషాలు పట్టడం ఆందోళనకరం” అని ఒక వినియోగదారుడు వ్యాఖ్యానించారు.
పోలీసులు ఏమన్నారంటే..
ఒక సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. “ఈ విషయం సోషల్ మీడియా టీమ్ ద్వారా మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పోలీస్ బృందం అక్కడికి చేరుకోవడానికి అంత సమయం ఎందుకు పట్టిందో కూడా దర్యాప్తు చేస్తున్నాం. విచారణలో తేలిన నిజాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
