ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలో క్రమశిక్షణ పేరుతో పసిపిల్లలకు క్రూరమైన శిక్షలు విధిస్తున్న కలచివేసే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఫలావదా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్రోలి గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ‘ముర్గా’ (కోడిపుంజు) ఆసనంలో కూర్చోబెట్టి కొడుతున్న వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది.
జిల్లా ప్రాథమిక విద్యాధికారి (BSA) నిందితుడైన ఇన్‌ఛార్జ్ ఉపాధ్యాయుడు గోవింద్ సింగ్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు.
బయటపడ్డ అసలు రంగు
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, క్లాసు బయట కొంతమంది చిన్నారులను ‘ముర్గా’ పొజిషన్‌లో కూర్చోబెట్టడం, మరికొంతమంది విద్యార్థినులను చేతులెత్తించి నిలబెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) త్రివేంద్ర కుమార్ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు.
కారణం తెలిస్తే షాక్ అవుతారు
సుమారు రెండు గంటల విచారణ మరియు పిల్లల స్టేట్‌మెంట్లను నమోదు చేసిన తర్వాత విస్తుపోయే నిజం బయటపడింది. పిల్లలు యూనిఫాం ధరించి రాలేదనే చిన్న కారణంతో మాస్టారు వారికి ఈ శిక్ష విధించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలను శారీరకంగా లేదా మానసిక హింసకు గురి చేయడం నేరమని అధికారులు స్పష్టం చేశారు.
తప్పించుకోవడానికి ‘యోగా’ ఎత్తుగడ
చర్యలు మొదలవ్వగానే, నిందితుడు గోవింద్ జాటవ్ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తాను పిల్లలను హింసించడం లేదని, ‘కొత్త విద్యా విధానం’ (NEP) కింద వారికి యోగా నేర్పిస్తున్నానని పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, గ్రామస్తులే స్కూల్లోకి చొరబడి తనపై దాడి చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు.
