మహారాష్ట్రలోని భివాండీలో ఉన్న ప్రముఖ ‘హరీష్ గులాబ్ జామున్’ స్వీట్ షాపులో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. స్వీట్స్ కొనేందుకు వచ్చిన ఒక కస్టమర్.. అక్కడ అమ్మకానికి ఉంచిన వేడివేడి గులాబ్ జామున్ గిన్నెను చూసి కంగుతిన్నాడు. అందులో నిండుగా ఉన్న చక్కెర పాకంలో ఒక ఎలుక ప్రాణాలతో జల్సాగా ఈత కొడుతూ స్పష్టంగా కనిపించింది.
ఇది గమనించిన ఆ కస్టమర్ వెంటనే తన మొబైల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ఇంటర్నెట్లో దావానలంలా వ్యాపించి ప్రజల్లో తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ విషయం తీవ్ర దుమారం రేపడంతో, మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో దుకాణంలో కనీస ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదని తేలింది. పైగా, దుకాణాన్ని నిర్వహించడానికి అవసరమైన లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా వారి వద్ద లేదని అధికారులు గుర్తించారు. దీంతో ఆరోగ్య, పరిశుభ్రత నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆ స్వీట్ షాపును వెంటనే మూసివేయాలని ఆదేశించిన FDA అధికారులు, దుకాణానికి ‘స్టాప్ బిజినెస్ నోటీసు’ (Stop Business Notice) జారీ చేసి కఠిన చర్యలు తీసుకున్నారు.

Leave a Reply