టెహ్రాన్: ఇరాన్‌తో భూతల యుద్ధం (Ground War) గనుక వస్తే, అమెరికాకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఇరాన్ అనుసరించే ‘గెరిల్లా యుద్ధతంత్రం’. సాధారణంగా గెరిల్లా యుద్ధం అంటే అడవులు లేదా కొండ ప్రాంతాల్లో జరుగుతుందని మనకు తెలుసు. కానీ, ఇరాన్ ఈ వ్యూహాన్ని నగరాల్లో కూడా అమలు చేసేలా తన సైన్యానికి శిక్షణ ఇచ్చింది. చిన్న చిన్న యూనిట్లుగా విడిపోయి, ఊహించని విధంగా భవనాల నుండి, సందుల నుండి దాడులు చేయడం ద్వారా అమెరికా సైన్యానికి భారీ ప్రాణనష్టాన్ని కలిగించడమే ఇరాన్ లక్ష్యం.
చిన్న యూనిట్లుగా విడిపోనున్న సైన్యం
సాధారణంగా అమెరికా దాడులు శత్రువుల ప్రధాన కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే ఇరాన్ తన సైన్యాన్ని వికేంద్రీకరించింది. కేంద్ర నాయకత్వం దెబ్బతిన్నా, చిన్న చిన్న విభాగాలుగా విడిపోయి యుద్ధాన్ని కొనసాగించేలా ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ప్స్’ (IRGC) 31 ప్రావిన్షియల్ కమాండ్లను ఏర్పాటు చేసింది. ప్రతి ప్రావిన్స్‌కు (టెహ్రాన్ నగరం సహా) సొంత ఆయుధాలు, నిఘా వ్యవస్థ, లాజిస్టిక్స్ మరియు ‘బాసిజ్’ (Basij) సైనికులు ఉంటారు. ఈ చిన్న గ్రూపులు చేసే దాడుల వల్ల అమెరికా సైన్యంలో పెరిగే ప్రాణనష్టం, ఆ దేశంలో రాజకీయ ఒత్తిడిని పెంచుతుంది.
ఇరాక్ యుద్ధంలా ఇక్కడ త్వరగా విజయం సాధించి వెనక్కి రావడం సాధ్యం కాదు. వియత్నాం యుద్ధం తరహాలో ఇక్కడి ప్రజలు తమ ప్రభుత్వం వైపు నిలబడటం అమెరికాకు పెద్ద మైనస్ కానుంది.
వీధుల్లో ప్రజా మద్దతు – సూసైడ్ స్క్వాడ్స్
5 నుండి 15 మంది సభ్యులతో కూడిన చిన్న చిన్న ‘డెత్ స్క్వాడ్స్’ లేదా సూసైడ్ స్క్వాడ్స్ తరహాలో ఇరాన్ సైన్యం పనిచేస్తుంది. నగరాల్లోని ఇరుకైన వీధుల నుండి ప్రధాన రహదారులపైకి వీరు దాడులు చేస్తారు. భవనాల పైకప్పులు, బేస్‌మెంట్ల నుండి దాడి చేసి క్షణాల్లో మాయమవ్వడం వీరి ప్రత్యేకత. మసీదులు, పాఠశాలలు, అపార్ట్‌మెంట్లు మరియు పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ ఇరాన్ నిర్మించిన టన్నెల్స్ (సురంగాలు) వీరికి రక్షణ కల్పిస్తాయి.
ట్యాంకులను కాదు, సైనికులను లక్ష్యం చేసుకుంటారు
ఈ గెరిల్లా గ్రూపులు నేరుగా భారీ ట్యాంకులతో తలపడవు. బదులుగా:
- శత్రు సైనికులను లక్ష్యంగా చేసుకుంటారు.
- ఆయుధాలను మరమ్మతు చేసే బృందాలను, ఆహారం మరియు ఇతర సామాగ్రిని మోసుకెళ్లే ట్రక్కులను దెబ్బతీస్తారు.
- దీని కోసం ఇరాన్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన స్నైపర్లు, ATGM (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్) టీమ్స్ ఉన్నాయి.
సైనికులు సాధారణ పౌరుల వేషంలోకి త్వరగా మారిపోవడం వల్ల అమెరికా సైన్యానికి వీరిని గుర్తించడం అసాధ్యం అవుతుంది.
అసిమ్మట్రికల్ వార్‌ఫేర్ (Asymmetrical Warfare)
తక్కువ ఖర్చుతో, చిన్న చిన్న పరికరాలతో భారీ సైన్యాన్ని నిర్వీర్యం చేయడమే ఇరాన్ వ్యూహం. ఆకాశంలో డ్రోన్లను వాడినట్టే, భూమిపై దేశీ బాంబులు (IEDs) మరియు చిన్న ఆయుధాలను వాడుతారు. పర్వత ప్రాంతాల్లో ఫోర్-వీలర్ వాహనాల ద్వారా వేగంగా కదులుతూ, లోయల్లోకి రాకెట్లు, మోర్టార్లతో దాడులు చేస్తారు.
‘కిల్ జోన్స్’ (Kill Zones)
రహదారులపై ముందుగానే నిర్ణయించిన ‘కిల్ జోన్స్’ వద్ద శత్రువులను చుట్టుముట్టి ప్రాణనష్టం కలిగిస్తారు. పొగమంచు, ఇసుక తుఫాను వంటి వాతావరణ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. గుహలు, కొండచరియలను స్థావరాలుగా చేసుకుని ఎంత కాలమైనా యుద్ధాన్ని కొనసాగించగల సామర్థ్యం ఇరాన్‌కు ఉంది.
