కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని దోమ్లూర్ (Domlur) 100 అడుగుల రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ బ్యాగులు, చెప్పులు రిపేర్ చేసే దుకాణంలోకి గత అక్టోబర్ 31వ తేదీ ఉదయం హెల్మెట్, చేతులకు గ్లౌజులు ధరించిన ఓ వ్యక్తి అక్రమంగా చొరబడ్డాడు.
ఆ సమయంలో దుకాణంలో ఒంటరిగా ఉన్న మహిళా ఉద్యోగిని పట్టుకున్న ఆ వ్యక్తి, తన దగ్గర ఉన్న కత్తిని ఆమె మెడపై ఉంచి, ఆమె వేసుకున్న బంగారు గొలుసును తీసివ్వాలని బెదిరించాడు.
ఆ యువతి నగలు ఇవ్వడానికి నిరాకరించి ప్రతిఘటించడంతో, ఆగ్రహించిన అతడు ఆమె గొంతు నులిమి, కత్తి చూపిస్తూ బెదిరిస్తూనే దుకాణం బయటకు లాక్కొచ్చాడు. ఆటోలో ఎక్కించి కిడ్నాప్ చేస్తానని బెదిరించిన అతని బారి నుంచి తనను విడిపించాలంటూ ఆ యువతి కన్నీరుమున్నీరుగా ఏడ్చిన దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది. చుట్టుపక్కల గుమిగూడిన ప్రజలు ఆమెను వదిలేయాలని అతన్ని హెచ్చరించారు.
అయినప్పటికీ, ఆ వ్యక్తి ఆమె గొంతు కోసేస్తానంటూ ప్రజలను బెదిరిస్తూనే ఉన్నాడు. ఎవరూ ఊహించని క్షణంలో ప్రజలంతా ఏకమై, ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని రెప్పపాటులో పట్టుకుని యువతిని సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి దేహశుద్ధి (ధర్మదేబ్బలు) చేసిన స్థానికులు, అక్కడున్న కరెంటు స్తంభానికి కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, యువతిని బెదిరించిన ప్రభురాజ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతంలో యువతి మెడపై కత్తి పెట్టి నగలు లాక్కోవడానికి ప్రయత్నించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విడుదలై, బెంగళూరులో మహిళల భద్రతపై తీవ్ర భయాందోళనలు, కలకలం రేపుతోంది.

Leave a Reply