మధ్యతరగతి కుటుంబాలలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఎదురైతే, ఇంట్లో ఉన్న బంగారమే ఆదుకుంటుంది. అందుకే పెద్దలు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం బంగారం కొనుగోలు చేయాలని చెబుతుంటారు.
మన దేశంలో బంగారం కేవలం సంప్రదాయానికి చిహ్నం మాత్రమే కాదు, ఒక మంచి పెట్టుబడి కూడా. భవిష్యత్తులో ఆర్థిక సమస్యల నుండి రక్షణ ఇస్తుందని చాలామంది బంగారంలో పెట్టుబడి పెడతారు. అవసరమైనప్పుడు దానిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. అయితే, బంగారాన్ని తాకట్టు పెట్టి వడ్డీ లేకుండా (లేదా తక్కువ భారం పడేలా) రుణం పొందవచ్చని చాలామందికి తెలియదు. ఒక ఆర్థిక నిపుణుడు వివరించిన ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ (Gold Overdraft) రుణం తీసుకోండి! ఆర్థిక నిపుణుడు ప్రేమ్ సోని తన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. మీరు మీ బంగారాన్ని బ్యాంక్ లాకర్లో ఉంచితే, ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే DICGC ఇన్సూరెన్స్ (రూ. 5 లక్షల వరకు) లాకర్లలోని వస్తువులకు వర్తించదు. కాబట్టి, మీ బంగారం సురక్షితంగా ఉండాలన్నా మరియు మీకు డబ్బు అందుబాటులో ఉండాలన్నా ‘గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్’ సౌకర్యం ఉత్తమ ఎంపిక. ఇందులో మీరు బంగారాన్ని తాకట్టు పెట్టి ఒక నిర్దిష్ట ‘ఓవర్‌డ్రాఫ్ట్ లిమిట్’ (OD Limit) పొందుతారు. దీనివల్ల బంగారం బ్యాంకులో భద్రంగా ఉంటుంది, అవసరమైనప్పుడు మీరు డబ్బు వాడుకోవచ్చు.
వడ్డీ లేకుండా రుణం పొందడం ఎలా? సాధారణంగా బ్యాంకులు మీ బంగారం మార్కెట్ విలువలో 70-75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని ఇస్తాయి. దీని కోసం మీరు స్వల్ప మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- అసలు ట్రిక్: ఈ పరిమితి (Limit) మంజూరైన తర్వాత, మీరు ఆ డబ్బును వాడితేనే వడ్డీ పడుతుంది.
- మీరు మీ బంగారం బ్యాంకులో పెట్టి లిమిట్ సెట్ చేసుకుని, అందులో నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకపోతే, మీరు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.
- కేవలం అత్యవసర సమయంలో మాత్రమే డబ్బు విత్ డ్రా చేసుకుని, మళ్ళీ జమ చేస్తే, మీరు వాడిన రోజులకు మాత్రమే వడ్డీ పడుతుంది. సాధారణ గోల్డ్ లోన్ లాగా మొత్తం నగదుపై వడ్డీ భారం ఉండదు.
