“మీ సిలిండర్ విజయవంతంగా డెలివరీ చేయబడింది” – సెల్‌ఫోన్‌కు వచ్చే ఈ ఒక్క మెసేజ్ ఇప్పుడు వేలాది మంది గృహిణుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చేతికి సిలిండర్ రాదు.. కానీ ఖాతాలో మాత్రం డెలివరీ అయినట్లు చూపిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘ఘోస్ట్ డెలివరీ’ (Ghost Delivery) పేరిట జరుగుతున్న ఈ భారీ కుంభకోణం సామాన్యుడి వంటగదిలో మంటలు పుట్టిస్తోంది.
గత ఒకటిన్నర నెలలుగా గల్ఫ్ యుద్ధ మేఘాల వల్ల చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. యుద్ధం ముగిసినా, గ్యాస్ మరియు ముడి చమురు సంక్షోభం వెంటనే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ క్లిష్ట పరిస్థితునే అదనుగా చేసుకున్న కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, అక్రమ సంపాదన కోసం సామాన్యుల సిలిండర్లను దారి మళ్లిస్తున్నాయి.
బుక్ చేయకుండానే డెలివరీ.. అసలేం జరుగుతోంది?
దక్షిణ ఢిల్లీలో నివసించే 72 ఏళ్ల వృద్ధురాలికి మార్చి 23న ఒక మెసేజ్ వచ్చింది. అసలు ఆమె సిలిండర్ బుక్ చేయనే లేదు, కానీ “డెలివరీ పూర్తయింది” అని వచ్చిన సందేశం చూసి ఆమె విస్తుపోయింది. మెసేజ్ వస్తే అంత కంగారు ఎందుకు అని అనుకోవచ్చు.. కానీ అసలు చిక్కు ఇక్కడే ఉంది!
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఒక సిలిండర్ డెలివరీ అయిన 25 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్ బుక్ చేసుకునే వీలుంటుంది. సదరు వృద్ధురాలు మార్చి 14న ఒక సిలిండర్ తీసుకున్నారు. అయితే, ఏజెన్సీ వారు ఆమెకు తెలియకుండానే మార్చి 23న ఒక డమ్మీ బుకింగ్ చేసి, సిలిండర్ డెలివరీ అయినట్లు రికార్డుల్లో చూపించారు. ఇప్పుడు ఆమె వద్ద ఉన్న గ్యాస్ నిజంగా అయిపోయినప్పుడు, సిస్టమ్ ఆమెను బుక్ చేసుకోనివ్వడం లేదు. “ఇంకా 25 రోజులు ఆగండి” అంటూ వచ్చే ఆటోమేటెడ్ రిప్లై చూసి ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
బ్లాక్ మార్కెట్ – అక్షరాలా రూ. 5000!
మధ్య ప్రాచ్య దేశాల్లో యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఎల్‌పిజి (LPG) దిగుమతులు తగ్గాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించారు.
- అధికారిక ధర: సుమారు రూ. 914
- బ్లాక్ మార్కెట్ ధర: రూ. 4,000 నుండి రూ. 5,000 వరకు!
రోడ్డు పక్కన హోటళ్లు, చిన్న రెస్టారెంట్లు మరియు సరైన పత్రాలు లేని వలస కార్మికులు గత్యంతరం లేక ఈ బ్లాక్ మార్కెట్ గ్యాస్‌ను ఆశ్రయిస్తున్నారు. ఒక సిలిండర్‌ను పద్ధతిగా డెలివరీ చేస్తే వచ్చే కమీషన్ కంటే, బ్లాక్‌లో అమ్మితే ఏకంగా రూ. 4,000 అదనపు లాభం వస్తుండటమే ఈ దారుణానికి కారణం.
ఓటిపి (OTP) వ్యవస్థను గారడీ చేస్తున్నారు!
సాధారణంగా సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు వినియోగదారుడు ఓటిపి చెబితేనే డెలివరీ ప్రక్రియ పూర్తవుతుంది. కానీ, “సర్వర్ సమస్య” లేదా “సాంకేతిక లోపం” అని సాకులు చెబుతూ ఈ ప్రక్రియను పక్కన పెట్టి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. ఒక లారీలో 360 సిలిండర్లు వస్తే, అవన్నీ డెలివరీ అయినట్లు రికార్డుల్లో చూపిస్తేనే తదుపరి లోడ్ వస్తుంది. అందుకే, గ్యాస్ వాడకం తక్కువగా ఉన్నవారిని లేదా అమాయకులను టార్గెట్ చేసి, వారి పేర్లపై సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారు.
కేంద్రం సీరియస్.. 50 వేల సిలిండర్ల సీజ్!
సోషల్ మీడియాలో బాధితుల గోడు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏప్రిల్ 10వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో సుమారు 50,000 అక్రమ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఏజెన్సీలకు నోటీసులు జారీ చేస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి దొంగచాటు వ్యవహారాలు జరిగినా, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇవి బహిర్గతమయ్యాయి. సామాన్యుల పొట్ట కొడుతున్న ఈ గ్యాస్ మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని జనం కోరుతున్నారు.
