మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న తులసి గ్రామం ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి కష్టాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గ్రామ సరిహద్దులో ఏర్పాటు చేసిన “గ్రామం అమ్మకానికి.. ధర నీళ్లు” అనే బ్యానర్.. అక్కడి ప్రజలు ఏ స్థాయిలో నీటి సమస్యను ఎదుర్కొంటున్నారో చెప్పకనే చెబుతోంది.
సుమారు 7 వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని 14 చెరువులు, బావులు ఎండిపోయి.. ప్రస్తుతం రాళ్ల మాదిరిగా కనిపిస్తున్నాయి.
తాగునీటితో పాటు వ్యవసాయ అవసరాలకు కూడా ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నీటి సమస్య ప్రభావం గ్రామంలోని యువతపై కూడా పడుతోంది. “నీళ్లు లేని గ్రామానికి మా అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయం” అంటూ చుట్టుపక్కల గ్రామాల వారు వివాహాలకు నిరాకరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
దీంతో తులసి గ్రామంలో సుమారు 350 మంది యువకులకు ఇప్పటికీ పెళ్లిళ్లు కాలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
మరోవైపు గ్రామానికి సమీపంలో సినా-మాధా నీటి ఎత్తిపోతల సాగునీటి పథకం ఉన్నప్పటికీ.. దాని కోసం చేపట్టిన సుమారు 800 మీటర్ల కాలువ పనులు 26 ఏళ్లుగా పూర్తికాకుండా నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద పైప్లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. నీటి వనరులే అందుబాటులో లేకపోవడంతో అవి కేవలం పైపులుగానే మిగిలిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పనుల కోసం రూ.90 లక్షలు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన స్థాయిలో పనులు జరగలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఏళ్ల తరబడి సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆగ్రహించిన గ్రామ ప్రజలు సెప్టెంబర్ 14 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఖాళీ పాత్రలను కొడుతూ నిరసన తెలిపారు.
ఇప్పుడు తమ నిరసనను మరింత వినూత్నంగా మార్చారు. “గ్రామాన్నే అమ్మకానికి పెడుతున్నాం.. ధరగా మాకు నీళ్లు ఇవ్వండి” అంటూ బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దత్తాత్రేయ భరణే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కథనం పేర్కొంటోంది. అయితే గ్రామస్తులు మాత్రం తాత్కాలిక హామీలు తమకు వద్దని.. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఒక గ్రామానికి రోడ్లు, విద్యుత్, ఇతర సౌకర్యాల కంటే ముందుగా కావాల్సింది నీరు. కానీ 26 ఏళ్లుగా నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తే.. ఆ గ్రామస్తుల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ నిరసన చూస్తే అర్థమవుతుంది.

Leave a Reply