గ్రామ పంచాయతీలో ఇల్లు కట్టడానికి అనుమతులు ఎలా తీసుకోవాలి?

గ్రామ పంచాయతీ (గ్రామ కంఠం) పరిధిలో ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఉన్న ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ ప్రక్రియ తప్పనిసరి. పాత పద్ధతిలో కేవలం కార్యదర్శికి డబ్బులు కట్టి రసీదు పొందే విధానం ఇప్పుడు లేదు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.

1. కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతి ఎలా తీసుకోవాలి?

మీరు ఖాళీ స్థలం కొన్నా లేదా పాత ఇంటిని తీసేసి కొత్తది కట్టాలన్నా ముందుగా గ్రామ పంచాయతీ నుండి అనుమతి పొందాలి. అనుమతి లేకుండా ఇల్లు కడితే పంచాయతీ కార్యదర్శి పనులను నిలిపివేసే అధికారం కలిగి ఉంటారు.

అవసరమైన పత్రాలు:

  • మ్యాపింగ్ (Plan): ఇంటి పొడవు, వెడల్పు, గదుల వివరాలు తెలియజేసే మ్యాప్.
  • అనెక్సర్-జి (Annexure G): నాణ్యమైన సిమెంట్, ఐరన్‌తో ఇల్లు కడుతున్నట్లు ధృవీకరణ.
  • ఆధార్ కార్డు: యజమాని గుర్తింపు కార్డు.
  • స్థల ధృవీకరణ పత్రం: స్థలం మీకు ఎలా వచ్చింది (వారసత్వమా లేదా కొనుగోలా) అనేది తెలియజేసే ₹20 లేదా ₹100 స్టాంపు పేపర్.
2. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ

పైన పేర్కొన్న నాలుగు పత్రాలను తీసుకుని మీ సేవ లేదా ఆన్‌లైన్ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

  1. ఆన్‌లైన్ చేయగానే దరఖాస్తు సంబంధిత పంచాయతీ కార్యదర్శి లాగిన్‌లోకి వెళ్తుంది.
  2. కార్యదర్శి స్థలాన్ని నేరుగా వచ్చి పరిశీలిస్తారు (Physical Verification).
  3. అన్నీ సరిగ్గా ఉంటే ఆన్‌లైన్‌లో ఓకే చేస్తారు.
  4. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును (ఇంటి విస్తీర్ణాన్ని బట్టి) ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
  5. పేమెంట్ పూర్తయ్యాక కార్యదర్శి డిజిటల్ సంతకం చేసిన అనుమతి పత్రాన్ని (Permission Certificate) అందజేస్తారు.
3. ఇంటి నంబర్ మరియు అసెస్‌మెంట్

అనుమతి పత్రం వచ్చిన తర్వాత ‘అసెస్‌మెంట్’ చేయించుకోవాలి. దీనివల్ల మీ ఇంటికి ఒక నంబర్ కేటాయించబడుతుంది. దీని ఆధారంగానే మీరు ఏటా ఇంటి పన్ను (House Tax) కట్టాల్సి ఉంటుంది. బ్యాంకు లోన్లు కావాలనుకునే వారికి ఈ అసెస్‌మెంట్ రసీదు, పర్మిషన్ సర్టిఫికేట్ చాలా ముఖ్యం.

4. ఇంటి రిజిస్ట్రేషన్ విధానం

ఒకరి పేరు మీద ఉన్న ఇంటిని మరొకరి పేరు మీదకు మార్చాలన్నా (రిజిస్ట్రేషన్) పైన పేర్కొన్న అనుమతి పత్రాలు, మ్యాపింగ్, ఆధార్ కార్డు మరియు ఇంటి ధృవీకరణ పత్రాలను తీసుకుని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఇంటి పన్ను రికార్డుల్లో పేరు మారుతుంది.

5. పాత ఇళ్లు ఉన్నవారు ఏం చేయాలి?

గతంలోనే ఇల్లు ఉండి, క్రమం తప్పకుండా ఇంటి పన్ను కడుతున్న వారి వివరాలు ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్ చేయబడ్డాయి. కాబట్టి వారు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇల్లు ఉండి కూడా ఇప్పటివరకు ఇంటి పన్ను కట్టకపోతే, వెంటనే కార్యదర్శిని కలిసి ఇంటి నంబర్ కేటాయించుకుని ఆన్‌లైన్ చేయించుకోవడం ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో అమ్మేటప్పుడు లేదా లోన్ తీసుకునేటప్పుడు ఇబ్బందులు రావచ్చు.

6. యజమాని మరణిస్తే పేరు మార్పిడి (Mutation)

ఇంటి యజమాని చనిపోయినట్లయితే, వారసుల పేరు మీదకు మార్చుకోవడానికి ‘మ్యుటేషన్’ అప్లై చేయాలి. దీనికి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు అవసరం అవుతాయి.

ముఖ్య గమనిక: గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు కట్టుకునే వారు భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ప్రభుత్వం సూచించిన ఈ ఆన్‌లైన్ పద్ధతులను పాటించడం తప్పనిసరి.


Posted

in

by

Tags: