“గ్రౌండ్‌లో కొట్టిన బంతి స్విమ్మింగ్ పూల్‌లో పడింది”. కొంచెం ఆ బంతి తీసి ఇవ్వమని అడగడం నేరమా? 22 ఏళ్ల క్రికెటర్‌పై కత్తితో దారుణంగా దాడి చేసిన వ్యక్తి.!!!

పంజాబ్ రాష్ట్రం మొహాలీలో క్రికెట్ ప్రాక్టీస్ సమయంలో జరిగిన ఓ చిన్న వివాదంలో, 22 ఏళ్ల యువ క్రికెటర్‌పై ఒక వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేసిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్‌కు చెందిన సాత్విక్ అమన్ (22), మొహాలీ సెక్టార్‌ ప్రాంతంలోని ‘ఓం సాయి క్రికెట్ అకాడమీ’లో రోజూ శిక్షణ పొందుతున్నాడు.

ప్రాక్టీస్ సమయంలో సాత్విక్ కొట్టిన క్రికెట్ బంతి మైదానం దాటి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో పడింది. ఆ బంతిని తీసుకురావడానికి వెళ్లగా పూల్ గేటుకు తాళం వేసి ఉంది. అప్పుడు బయటకు వచ్చిన పూల్ యజమాని జస్బీర్ సింగ్, సాత్విక్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. బంతిని మాత్రమే తిరిగి ఇవ్వమని సాత్విక్ అడిగినా వినకుండా, వాగ్వాదం పెరగడంతో జస్బీర్ సింగ్ అకస్మాత్తుగా లోపలికి వెళ్లి చేతిలో కత్తితో తిరిగి వచ్చాడు.

తనను తాను రక్షించుకోవడానికి సాత్విక్ ఓ వెదురు కర్రను తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అతన్ని విచక్షణారహితంగా నరికాడు. సాత్విక్ తన తలను కాపాడుకునే ప్రయత్నంలో అతని చేతికి బలమైన గాయమైంది. అంతేకాకుండా అతను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీపుపై రెండుసార్లు నరికి, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అతని సోదరుడు సాకేత్ అక్కడికి చేరుకుని అతన్ని ఆసుపత్రిలో చేర్పించాడు.

చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన సాత్విక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు జస్బీర్ సింగ్‌పై కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. క్రీడా మైదానంలో చిన్న విషయానికే జరిగిన ఈ దాడి ఘటన క్రికెటర్లలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.


Posted

in

by

Tags: