క్రైమ్ న్యూస్: రాజస్థాన్లోని జోధ్పూర్ పరిధిలోని ఖేడాపా పోలీస్ స్టేషన్ పరిధి నుండి గుండెల్ని పిండేసే ఒక దారుణమైన ఉదంతం వెలుగుచూసింది. ఇక్కడ మార్చి నెలలో ఒక మహిళ సామూహిక అత్యాచారం మరియు బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడగా.. ఇప్పుడు రెండు నెలల తర్వాత ఆమె చిన్న సోదరి కూడా ఆత్మహత్య చేసుకుంది.
తన పెద్ద సోదరికి న్యాయం చేకూర్చడం కోసం ఆ చిన్న సోదరి నిరంతరం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పోరాటం సాగించింది. ఇద్దరు సోదరిమణులు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సరైన సమయంలో స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని, పోలీసుల పనితీరుపై స్థానికులు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
అసలు ఏం జరిగింది?
ఎన్డీటీవీ కథనం ప్రకారం.. పెద్ద సోదరిపై జరిగిన అన్యాయానికి సంబంధించి చిన్న సోదరి ఏప్రిల్ 11న పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. స్థానిక ఈ-మిత్ర సేవా కేంద్ర నిర్వాహకుడైన మహిపాల్ అనే నిందితుడు తన పెద్ద సోదరిని ప్రేమ పేరుతో నమ్మించి, అశ్లీల వీడియోలను రికార్డ్ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ దారుణానికి సంబంధించి చిన్న సోదరి మొత్తం 8 మంది నిందితుల పేర్లను ఫిర్యాదులో నమోదు చేసింది.
మహిపాల్ మరియు అతని అనుచరులు దాదాపు నాలుగేళ్లపాటు పెద్ద సోదరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ క్రమంలో వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిలింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేశారని ఆమె పేర్కొంది. ఈ వేధింపులు భరించలేక మార్చి 20న పెద్ద సోదరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోదరి మరణం తర్వాత.. తమకు న్యాయం జరగకపోతే తాను కూడా ప్రాణాలు తీసుకుంటానని ఆ చిన్న సోదరి పోలీసులను హెచ్చరించింది. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, నిందితులపై ఎలాంటి గట్టి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
చిన్న సోదరిపై కూడా వేధింపులు
పెద్ద సోదరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత, నిందితులు చిన్న సోదరిని కూడా వదల్లేదు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని బెదిరిస్తూ, ఆమెపై కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ నిందితులు ఏమాత్రం భయం లేకుండా తిరిగేవారని, పోలీసులు తమను ఏమీ చేయలేరంటూ బాధితురాలిని మరింత భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం.
వాటర్ ట్యాంక్ ఎక్కి విషం తాగిన వైనం
పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, స్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోయిన ఆ చిన్న సోదరి తీవ్ర మనస్తాపానికి లోనైంది. చివరకు ఆమె ఒక వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి విషం తాగింది. గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసింది. ఈ ఘోర ఉదంతం వెలుగులోకి రావడంతో స్థానిక సమాజంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తరఫు బంధువులు, స్థానికులు ఎండీఎం ఆసుపత్రి వెలుపల పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.
