లక్నో: ఏ షాపు వెజ్ బిర్యానీ కోసం జనం క్యూ కట్టేవారో, అక్కడ వెలుగు చూసిన ఒక వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ‘బక్షీ కా తాలాబ్’ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి GCRG కాలేజీ గేటు సమీపంలో ఉన్న ఒక ప్రముఖ వెజ్ బిర్యానీ షాపు ఫ్రీజర్‌లో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది.
అసలేం జరిగింది? ఈ వెజ్ బిర్యానీ షాపు గత నాలుగు రోజులుగా మూసివేసి ఉంది. షాపు యజమాని తండ్రి మరణించడంతో, అంత్యక్రియల కోసం అతను తన గ్రామానికి వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చి షాపు తెరిచిన యజమానికి కోలుకోలేని షాక్ తగిలింది. అతను ముందుగా షాపును శుభ్రం చేసి, మార్కెట్ నుండి కూరగాయలు తీసుకువచ్చాడు. వాటిని ఫ్రిజ్‌లో పెట్టడానికి ఫ్రీజర్ తలుపు తెరవగానే, లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు.
ఫ్రీజర్‌లో యువకుడి శవం: ఫ్రీజర్‌లో ఒక యువకుడి మృతదేహం పడి ఉంది. భయంతో వణికిపోయిన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పరిసరాల్లోని CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆ యువకుడిని షాపులోనే హత్య చేశారా? లేదా ఎక్కడో హత్య చేసి శవాన్ని ఇక్కడ దాచారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యజమాని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Leave a Reply