గాజియాబాద్: బంధాల మధ్య పెరిగిపోతున్న హింసకు నిదర్శనంగా గాజియాబాద్‌లో ఒక భయంకరమైన ఘటన వెలుగుచూసింది. గృహ వివాదం ముదిరిపోవడంతో, ఒక భార్య కోపంతో తన భర్త నాలుకను పళ్లతో కొరికి వేసింది.
ఈ సంచలన ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. నిందితురాలు ఈషాను పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె భర్త విపిన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను మాట్లాడే శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
పెళ్లైన నెల రోజులకే మొదలైన గొడవలు
ఈ ఘటన గాజియాబాద్‌లోని సంజయ్‌పురి (బేగమాబాద్) ప్రాంతంలో జరిగింది. జూన్ 2025లో రామ్ అవతార్, గీత దంపతులు తమ ఏకైక కుమారుడు విపిన్‌కు మీరట్‌కు చెందిన ఈషాతో వివాహం జరిపించారు. పెళ్లైన నెల రోజుల నుంచే ఈషా ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఇంట్లో గొడవలు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మద్యం, రీల్స్ పిచ్చితో నిత్యం గొడవలు
విపిన్ తల్లి గీత తెలిపిన వివరాల ప్రకారం.. కోడలు ఈషా రహస్యంగా మద్యం, సిగరెట్లు తాగేది. ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ గడిపేది. విపిన్ దీనిని వ్యతిరేకిస్తే ఆమె గొడవకు దిగేది. అనేకసార్లు ఇల్లు వదిలి వెళ్లిపోతానని బెదిరించడమే కాకుండా, భర్తపై భౌతిక దాడికి కూడా పాల్పడేదని వారు తెలిపారు.
‘అండా కర్రీ’ చిచ్చు
సోమవారం రాత్రి ఈషా గుడ్డు కూర (అండా కర్రీ) వండింది. రాత్రి 8 గంటలకు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన విపిన్, ప్రతిరోజూ గుడ్లేనా అని అడగడంతో వివాదం మొదలైంది. ఈషా చికెన్ కావాలని పట్టుబట్టి, మంచం కింద దాచిన మద్యం సీసా తీసింది. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, అది అర్ధరాత్రి కల్లా ఘర్షణకు దారితీసింది.
ప్రేమ నటిస్తూనే దారుణం
రాత్రి ఒంటి గంట సమయంలో గొడవ తీవ్రమైంది. ఈషా మొదట విపిన్‌ను చెంపదెబ్బలు కొట్టింది. ఆ తర్వాత ప్రేమగా ముద్దు పెడుతున్నట్లు నటిస్తూ, విపిన్ నాలుకను తన పళ్లతో బలంగా కొరికి వేసింది. విపిన్ నోరంతా రక్తసిక్తమైంది. నొప్పితో విలవిలలాడుతూ కిందకు వచ్చి, తెగిపోయిన నాలుక ముక్కను తల్లికి చూపించాడు.
మాట్లాడటం కష్టమేనన్న వైద్యులు
విపిన్‌ను మీరట్‌లోని సుభారతి మెడికల్ కాలేజీలో చేర్పించారు. అతని నాలుక సుమారు 2.5 సెంటీమీటర్లు తెగిపోయిందని వైద్యులు తెలిపారు. సర్జరీ చేసినప్పటికీ, నాలుకను పూర్తిగా అతికించడం సాధ్యం కాదని, ప్లాస్టిక్ సర్జరీ చేసినా అతని మాట మునుపటిలా ఉండదని వారు స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్లోనూ అదే అహంకారం
పోలీసులు ఈషాను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆమె మహిళా పోలీసులతో కూడా గొడవకు దిగింది. కోపంలోనే తాను నాలుక కొరికానని పోలీసుల ఎదుట అంగీకరించింది. పోలీసులు ఆమెపై BNS (భారతీయ న్యాయ సంహిత) కింద తీవ్రమైన సెక్షన్లతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. న్యాయ నిపుణుల ప్రకారం, శరీర భాగాన్ని వేరు చేసిన ఇటువంటి నేరాలకు 15 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.
