భోగి పండుగ అంటే “పాత సామాన్లు తగలబెట్టాలి” అంటారు, కానీ ఒక వ్యక్తి ఏకంగా తన సొంత ఇంటికే నిప్పు పెట్టిన వింతైన మరియు భయంకరమైన ఘటన ఈరోడ్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ కలహాల కారణంగా ఒక ఆటో డ్రైవర్ చేసిన ఈ పని ఆ ప్రాంతాన్ని రణరంగంగా మార్చేసింది.
ఏం జరిగిందంటే? తమిళనాడు ఈరోడ్ జిల్లా కరుంగల్పాళయంలోని రాజగోపాల్ తోట ప్రాంతానికి చెందిన సెంథిల్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుధ, 18 ఏళ్ల కొడుకు ఉన్నారు. సెంథిల్‌కు మద్యం తాగే అలవాటు ఉంది, తరచూ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. విసిగిపోయిన సుధ, “నీతో ఉండలేను, విడిపోదాం” అని చెప్పింది.
నేడు భోగి పండుగ కావడంతో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో, సెంథిల్ ఉదయాన్నే తాగి వచ్చి సుధతో గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో సుధ కోపంతో ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన సెంథిల్, మద్యం మత్తులో తన సొంత ఇంటి బెడ్రూమ్కు నిప్పు పెట్టాడు. మంటలు వేగంగా ఇల్లంతా వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటల మధ్య ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లను చాకచక్యంగా బయటకు తీశారు. ఒకవేళ ఆ సిలిండర్లు పేలి ఉంటే ఆ వీధి మొత్తం నేలమట్టమయ్యేది. ఇంట్లోని మంచం, బీరువా, ఇతర ముఖ్యమైన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. పోలీసులు సెంథిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
