ముంబై: ముంబైలో ఒక హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పన్వేల్‌లోని కలంబోలి ప్రాంతంలో ఒక తల్లి తన 6 ఏళ్ల కన్నకూతురిని అతి దారుణంగా హత్య చేసింది. నిందితురాలికి కొడుకు కావాలని కోరిక ఉండేది, కానీ అమ్మాయి పుట్టడంతో ఆమె గత కొన్నేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది.
అంతేకాకుండా, ఆ చిన్నారి నిరంతరం హిందీ భాషలో మాట్లాడుతుండటం తల్లికి నచ్చేది కాదు. ఈ విషయంలో తల్లికి తన కూతురిపై విపరీతమైన కోపం ఉండేది. ఈ కేసులో పోలీసులు సుప్రియా ప్రమోద్ మ్హాముంకర్ (30) అనే మహిళను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమెను పన్వేల్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆమెకు 3 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
హిందీలో మాట్లాడిందని ప్రాణాలు తీసింది…
మరణించిన చిన్నారి ఎప్పుడూ హిందీలోనే మాట్లాడేది. కానీ, ఆమె తల్లి మాత్రం మరాఠీలోనే మాట్లాడాలని నిరంతరం కూతురిని వేధించేది. ఘటన జరిగిన రోజు కూడా చిన్నారి హిందీలో మాట్లాడటంతో ఆగ్రహం చెందిన తల్లి, కోపంతో కూతురి గొంతు నులిమి చంపేసింది. నిందితురాలి భర్త ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరు కలంబోలి సెక్టార్-E లోని గురు-సంకల్ప్ సొసైటీలో నివసిస్తున్నారు.
అనారోగ్యంతో చనిపోయిందని నాటకం
తొలుత నిందితురాలు తనను తాను రక్షించుకోవడానికి, డిసెంబర్ 23న తన కూతురు అనారోగ్యంతో మరణించిందని నమ్మబలికింది. ప్రాథమికంగా ఇది సాధారణ మరణమే అని అందరూ భావించారు. అయితే, పన్వేల్ సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రి వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదికలో ఆ చిన్నారి గొంతు నులమడం వల్లే మరణించిందని తేలింది.
భర్త చెప్పిన దిగ్భ్రాంతికర నిజాలు…
పోలీసులు నిందితురాలిని గట్టిగా విచారించగా, కూతురి నోరు మరియు ముక్కు నొక్కి చంపినట్లు ఆమె అంగీకరించింది. తనకు కొడుకు పుట్టలేదన్న ఆవేదనతోనే ఈ పని చేసినట్లు చెప్పింది. కాగా, నిందితురాలి భర్త ప్రమోద్ పోలీసులకు ఒక కీలక విషయం చెప్పారు. 2019లో తమ కూతురు కేవలం ఒక నెల వయసున్న పసికందుగా ఉన్నప్పుడు కూడా, సుప్రియా ఆమెను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిందని ఆయన వెల్లడించారు.
