మహారాష్ట్రలోని పుణెలో తాను ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ ఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 21 ఏళ్ల యువకుడు, అక్కడి నివాసితుల వద్ద సుమారు రూ.35 లక్షలు మోసం చేసిన కేసులో అరెస్టయ్యాడు.
హితేష్ ప్రమోద్ కులకర్ణి అనే ఆ యువకుడు నిజానికి 12వ తరగతి (ఇంటర్) మాత్రమే చదివాడని పోలీసుల విచారణలో తేలింది. ఐఏఎస్ అధికారి అనే నకిలీ గుర్తింపును ఉపయోగించి నివాసితుల నమ్మకాన్ని గెలుచుకున్న అతను, అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లను లాటరీ పద్ధతిలో తక్కువ ధరకు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు.
సొసైటీ కార్యదర్శి, కోశాధికారి సంతకాలను ఫోర్జరీ చేసి, సొసైటీ ఆన్లైన్ బ్యాంకు ఖాతాలను తన ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. సొసైటీలో మెయింటెనెన్స్ ఛార్జీల రూపంలో జమ అయిన రూ.37 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్‌పై రూ.10 లక్షల రుణం తీసుకున్నాడు. అందులో రూ.5 లక్షలను చెక్కు ద్వారా డ్రా చేయగా, మిగిలిన రూ.5 లక్షలను తన సొంత ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలతో ఆ ఫిక్స్డ్ డిపాజిట్‌ను గడువుకు ముందే రద్దు చేయాలని దరఖాస్తు చేశాడు.
రుణం మొత్తం పోగా బ్యాంకు ఖాతాలో తిరిగి జమ అయిన రూ.27 లక్షలతో పాటు, అప్పటికే ఉన్న రూ.3 లక్షలను కూడా తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకుని మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ కింద 5 నుంచి 6 ఇళ్లు కేటాయిస్తామని చెప్పి బంధువులు, పరిచయస్తుల వద్ద కూడా డబ్బులు వసూలు చేశాడు. ఇందుకోసం ఓ నిర్మాణ సంస్థ ఉద్యోగి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీని సృష్టించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో నకిలీ అలాట్మెంట్ లెటర్లను తయారు చేసి పంపినట్లు విచారణలో వెల్లడైంది.
గత 2025లోనే తాను ఐఏఎస్ అధికారిని అయ్యానని హితేష్ తన కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. పుణెలోని బాలేవాడి ప్రాంతానికి మారిన తర్వాత, సన్మాన సభ ఫోటోలు, వార్తాపత్రికల కథనాలను చూపిస్తూ తన నకిలీ గుర్తింపును బలపరుచుకున్నాడు. దీనిని నమ్మిన నివాసితులు అతడిని సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇళ్లు కేటాయించకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు ఆరా తీయగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీనితో బనేర్ పోలీసులు అతడిని అరెస్టు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Leave a Reply