మహారాష్ట్రలోని డోంబివ్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి.. ఆ ఘటన తర్వాత తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. చనిపోయిన స్నేహితుడు గత 20 రోజులుగా కలలో కనిపిస్తూ బెదిరిస్తున్నాడని భయపడిన అతడు చివరకు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. విశాల్ కదమ్ (42), ప్రభు గర్కడే ఇద్దరూ సన్నిహిత స్నేహితులు. ఒకరోజు ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తుండగా వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రభు దాడి చేయడంతో విశాల్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు కథనం.
హత్య జరిగిన తర్వాత భయపడిపోయిన ప్రభు.. తన ఇంటి యజమాని సందేశ్ మాత్రే సహాయంతో మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కట్టి, ఎవరికీ అనుమానం రాకుండా జనసంచారం లేని ప్రాంతంలో పడేసినట్లు సమాచారం.
అయితే, ఈ ఘటన జరిగినప్పటి నుంచి ప్రభు తీవ్ర భయంతో జీవిస్తున్నాడు. దాదాపు 20 రోజులుగా సరిగా నిద్రపోలేకపోయాడని, చనిపోయిన తన స్నేహితుడు కలలో కనిపిస్తూ చంపేస్తానని బెదిరిస్తున్నాడని భయపడినట్లు కథనం పేర్కొంది.
చివరకు ఆ భయాన్ని తట్టుకోలేక నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వెల్లడించి లొంగిపోయాడు.
దీంతో పోలీసులు ప్రభుతో పాటు మృతదేహాన్ని తరలించడంలో సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటి యజమాని సందేశ్ మాత్రేను కూడా అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి, నాలుగు రోజుల పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.

Leave a Reply