మరణం తర్వాత ఏం జరుగుతుంది? నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు విజ్ఞాన శాస్త్రం దగ్గర కూడా సమాధానం లేదు. కానీ, కొంతమంది పంచుకునే అనుభవాలు మన ఆలోచనా దృక్పథాన్ని మార్చేస్తాయి.
స్కాట్లాండ్కు చెందిన 63 ఏళ్ల జేన్ డాసన్ (Jane Dawson) చేసిన ఒక వాదన ఇప్పుడు మరణం తర్వాత జీవితంపై కొత్త చర్చకు దారితీసింది. సుమారు 24 ఏళ్ల క్రితం తన కుమారుడు ఆర్చీ పుట్టే సమయంలో తాను దాదాపు మరణించానని, కానీ ఆ ‘పరలోకం’లో తన మరణించిన తండ్రిని కలిశానని ఆమె చెబుతోంది. ఆయనే తనను తిరిగి భూమిపైకి పంపించారని జేన్ పేర్కొంది. ఆమె అనుభవం ప్రకారం, స్వర్గం అనేది ఒక ‘భౌతికమైన చోటు’ కాదు, అది కేవలం మనస్సు యొక్క ఒక స్థితి (State of consciousness).
ఆ నిమిషంలో ఏం జరిగింది?
ప్రసవ వేదనతో తాను తీవ్రంగా అలసిపోయిన సమయంలో, అకస్మాత్తుగా తన ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చినట్లు అనిపించిందని జేన్ వివరించింది. అప్పటివరకు ఉన్న నొప్పి క్షణాల్లో మాయమైపోయింది. ఆమె భౌతిక మరియు అభౌతిక ప్రపంచాల మధ్య ఉన్న ఒక ప్రదేశానికి చేరుకుంది. అక్కడ చీకటిగా ఉన్నప్పటికీ, ఎంతో ప్రశాంతత మరియు అనంతమైన ప్రేమ నిండి ఉంది. అక్కడే ఆమెకు తన తండ్రి ఉనికి తెలిసింది. ఆయన ఆమె చనిపోవడానికి మూడు నెలల ముందే మరణించారు.
“నేను ఆయన్ని కళ్ళతో చూడలేదు, వినలేదు.. కానీ అది నా తండ్రి అని నాకు 100 శాతం తెలుసు. మా ఆత్మలు కలిశాయి. మాటలు లేకుండానే ఆయన నాతో సంభాషించారు. నేను వెళ్లాల్సిన సమయం ఇంకా రాలేదని, నా కొడుకును పెంచడానికి తిరిగి వెళ్లాలని ఆయన చెప్పారు.” అని జేన్ తెలిపింది.
కొడుకు రూపంలో తండ్రి పునర్జన్మ?
తన తండ్రి తనకు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని దృశ్యాలను చూపించారని, ఆ తర్వాత తాను తిరిగి తన శరీరంలోకి వచ్చినట్లు జేన్ చెప్పింది. ఆ తర్వాత ఆమె తన కుమారుడికి జన్మనిచ్చింది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. తన కుమారుడు ఆర్చీ, తన తండ్రి యొక్క పునర్జన్మ అని జేన్ నమ్ముతోంది.
ఆమె తండ్రి చనిపోయేటప్పుడు కోమాలో ఉన్నప్పుడు, “నాకు కొడుకు పుట్టబోతున్నాడు, వాడిని ఎప్పుడూ చూస్తూ ఉండండి” అని ఆమె ఆయన చెవిలో చెప్పిందట. ఆర్చీ పెరిగేకొద్దీ అచ్చు తన తాత పోలికలతోనే ఉన్నాడని, మాటలు రాగానే తన తాత వృత్తి అయిన ‘పోలీస్’ అవుతానని పట్టుబట్టేవాడని ఆమె చెబుతోంది.
మరణం ఒక భ్రమ (Illusion):
ఈ ఘటన తర్వాత జేన్ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. మరణం అనేది ముగింపు కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ అని ఆమె అంటోంది.
- స్వర్గం అంటే ఏమిటి?: ఇది ఆకాశంలో మేఘాల పైన ఉండే ప్రదేశం కాదు, ఇదొక శక్తి క్షేత్రం (Non-physical energetic realm).
- మరణం తర్వాత: మనం శరీరాన్ని మాత్రమే వదులుతాము, శక్తి రూపంలో అలాగే ఉంటాము. అక్కడ మన జీవిత సమీక్ష జరిగిన తర్వాత, మళ్ళీ కొత్త రూపంలో భూమిపైకి వస్తాము.
ప్రస్తుతం జేన్ ఒక ఆధ్యాత్మిక మాధ్యమంగా (Psychic Medium) పనిచేస్తూ, మరణం పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తోంది.
