కర్బూజాలో సుమారు 90 శాతం వరకు నీరు ఉంటుంది. దీనితో పాటు విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. వేసవిలో డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ఫలం. అయితే, బయట చూడ్డానికి బాగున్నా, కోసిన తర్వాత లోపల పచ్చిగా లేదా రుచి లేకుండా ఉండే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కర్బూజా కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
కర్బూజాలోని పోషక విలువలు: ఇందులో నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువ. విటమిన్ A, C, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ మరియు పొటాషియం వంటివి లభిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఇమ్యూనిటీ, కళ్లు, గుండె మరియు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
తీయని కర్బూజాను గుర్తించే మార్గాలు:
- సువాసన చూడండి: కర్బూజా కొనే ముందు దాని తొడిమ భాగం దగ్గర వాసన చూడండి. అక్కడ నుండి మంచి తీపి వాసన వస్తుంటే ఆ పండు పర్ఫెక్ట్‌గా పండిందని అర్థం. ఎలాంటి వాసన రాకపోయినా లేదా పచ్చి వాసన వచ్చినా అది పచ్చిదని గుర్తించాలి.
- బరువును గమనించండి: మీరు తీసుకున్న కర్బూజా దాని పరిమాణం కంటే బరువుగా అనిపిస్తే, అందులో నీటి శాతం ఎక్కువగా ఉందని మరియు అది తీయగా ఉంటుందని అర్థం. తేలికగా ఉంటే అది లోపల ఎండిపోయి లేదా గింజలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
- రంగు మరియు డిజైన్: పండు పండినప్పుడు దాని తొక్క లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటుంది. పైన పచ్చగా ఉంటే అది పచ్చిది. అలాగే కర్బూజా పైన ఉండే నెట్ లాంటి డిజైన్ (జాలీ) ఉబ్బెత్తుగా ఉంటే అది నాణ్యమైన పండు.
- నొక్కి చూడండి: కర్బూజాను చేతిలోకి తీసుకుని వేళ్లతో మెల్లగా నొక్కండి. అది కొంచెం మెత్తగా అనిపిస్తే పండినట్లు. మరీ ఎక్కువగా లోపలికి దిగిపోతే అది కుళ్ళిపోయిందని అర్థం. గట్టిగా రాయిలా ఉంటే అది ఇంకా పచ్చిగానే ఉన్నట్లు.
- శబ్దం ద్వారా: పండును చేత్తో తట్టి చూడండి. ఖాళీగా ఉన్నట్లు (హోలో సౌండ్) శబ్దం వస్తే అది బాగా పండినట్లు లెక్క.
