చలికాలంలో పిల్లలకు టోపీ, సాక్స్‌లు వేసి పడుకోబెట్టాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారు?

చలికాలం వచ్చిందంటే చాలు పిల్లలకు జలుబు చేస్తుందేమోనని తల్లిదండ్రులు వారిని పూర్తిగా కప్పేస్తుంటారు. కానీ, నిద్రపోయేటప్పుడు టోపీలు, సాక్స్‌లు ధరించడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పిల్లల శరీరం పెద్దల కంటే భిన్నం: పెద్దల శరీరంతో పోలిస్తే పిల్లల శరీరం భిన్నంగా ఉంటుందని డాక్టర్ నిమిషా పేర్కొన్నారు. పిల్లల్లో ‘బ్రౌన్ ఫ్యాట్’ (Brown Fat) ఎక్కువగా ఉంటుంది, ఇది సహజంగానే వారి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, వారి మెటబాలిజం (జీవక్రియ) కూడా వేగంగా ఉంటుంది. అందుకే రాత్రిపూట పిల్లల శరీరం పెద్దల కంటే వెచ్చగా ఉంటుంది.

నిద్రపోయేటప్పుడు టోపీ అవసరమా? పిల్లలు నిద్రపోయేటప్పుడు టోపీ (Cap) ధరించడం అస్సలు అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. నిజానికి అలా చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి:

  • ఉష్ణోగ్రత నియంత్రణ: పిల్లల శరీర ఉష్ణోగ్రత ప్రధానంగా వారి తలపై నుండే నియంత్రించబడుతుంది. టోపీ వేయడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోలేక, పిల్లల శరీరం ‘ఓవర్ హీట్’ (అతిగా వేడెక్కడం) అయ్యే ప్రమాదం ఉంది.
  • శ్వాస ఇబ్బందులు: నిద్రలో టోపీ జారి మగతగా ఉన్న పసిపిల్లల ముక్కు లేదా నోటిపై పడితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.

సాక్స్‌లు వేయవచ్చా? సాక్స్‌ల విషయంలో అది గది ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ వివరించారు.

  • గది మరీ చల్లగా ఉంటే, తేలికపాటి (Lightweight) సాక్స్‌లు వేయవచ్చు.
  • ఒకవేళ గదిలో హీటర్ వాడుతున్నా లేదా గది ఇప్పటికే వెచ్చగా ఉన్నా సాక్స్‌లు వేయాల్సిన అవసరం లేదు.

Posted

in

by

Tags: