రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు అందించే ఆహారం, తాగునీటి నాణ్యతతో పాటు పరిశుభ్రత ప్రమాణాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, తాజాగా మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర దుమారం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ ప్రాంతంలో తీసినట్లుగా చెబుతున్న ఈ వీడియోలో.. ఒక యువతి రైలు కింది భాగం నుండి కారుతున్న మురుగు లాంటి నీటితో భోజన పాత్రలను (ప్లేట్లను) కడుగుతున్న దృశ్యం రికార్డైంది.
ఎరుపు రంగు చీర కట్టుకున్న ఆ మహిళ, రైలు బోగీ కింద కూర్చుని ప్లాస్టిక్ ప్లేట్లను, గిన్నెలను అక్కడ కారుతున్న మురికి నీటిలో కడుగుతూ తుడుస్తున్న దృశ్యాన్ని చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ‘ఛప్రాజిల్లా’ (ChapraZila) అనే ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారడంతో, రైళ్లలో విక్రయించే ఆహారాన్ని కొనుగోలు చేయాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజూ నమ్మి ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడటం చూసి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారుణమైన పారిశుద్ధ్య లోపంపై రైల్వే శాఖ అధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, సంబంధిత ఫుడ్ క్యాంటీన్, కాంట్రాక్టర్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఆ పాత్రలను కడగడానికి ఉపయోగించిన నీరు ఎక్కడి నుంచి వస్తోంది, దాని అసలు మూలం ఏమిటి అనే దానిపై అధికారిక సమాచారం వెలువడనప్పటికీ, ఈ సంఘటన రైల్వే శాఖ పారిశుద్ధ్య చర్యల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. ఇంటర్నెట్ను కుదిపేస్తున్న ఈ ఘటన రైలు ప్రయాణికుల భద్రత, ఆహార పరిశుభ్రతపై చర్చను మళ్లీ తీవ్రతరం చేసింది.
