మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఆస్తి తగాదాల కారణంగా ఒక వృద్ధుడు తన సొంత కోడలు, మనవళ్ల చేతిలో నడిరోడ్డుపై దారుణంగా దాడికి గురైన ఘటన కలకలం రేపింది. ఆ వృద్ధుడిని వారు రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ అమానవీయ ఘటన అక్కడున్న సిసిటివి కెమెరాలో రికార్డవ్వగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సిసిటివి దృశ్యాల్లో, ఆ ముఠా వృద్ధుడిని చుట్టుముట్టి, నేలకేసి కొట్టి, కాళ్లతో తన్నుతూ క్రూరంగా దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. తనను కొట్టవద్దని, వదిలేయమని ఆ వృద్ధుడు చేతులెత్తి ప్రాధేయపడుతున్నా, ఆ రాక్షస కుటుంబం అతడిని వదలకుండా కొడుతూనే ఉంది. తనకు ఉన్న ఆస్తిని బలవంతంగా లాక్కోవడానికి కోడలు, మనవళ్లు కలిసి ఈ దారుణమైన దాడి చేశారని బాధితుడు ఆరోపించారు.
ఈ దాడిపై మొదట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో, గాయాలతో ఉన్న వృద్ధుడు నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి న్యాయం చేయమని కోరారు. ఈ సిసిటివి దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అయి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో, పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
