హర్యానాలోని ఫరీదాబాద్‌లో ప్రభుత్వ బీకే ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గాయాలతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడి చేతులు, కాళ్లను మంచానికి కట్టేసిన స్థితిలో ఉంచారు. ఇలా ఏడు రోజుల పాటు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, చివరకు ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు.
గత నవంబర్ 8వ తేదీ రాత్రి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు చెందిన అంబులెన్స్‌లో గాయాలతో ఉన్న ఆ యువకుడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో మొదట్లో అతను ఎవరో గుర్తించడం సాధ్యం కాలేదు. అయితే, అతని చేతిపై పచ్చబొట్టుగా ఉన్న ‘కపిల్’ అనే పేరు మాత్రమే గుర్తింపు కోసం ఒక ఆధారంగా నిలిచింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో యువకుడి చేతులు, కాళ్లను మంచానికి కట్టేసి ఉంచిన వీడియో బయటకు రావడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సుమారు ఏడు రోజుల పాటు అతడిని అలా కట్టేసి ఉంచినట్లు ఆరోపణలు వస్తుండగా, నవంబర్ 15న చికిత్స పొందుతూ అతను మరణించాడు. అతనికి సరైన సమయానికి ఆహారం, నీరు అందించలేదని, ఇదే మరణానికి కారణమై ఉండవచ్చని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆస్పత్రి యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది.
ఆస్పత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువకుడి ప్రవర్తన అసాధారణంగా ఉండేదని, ఇతర రోగులకు హాని కలిగించే ప్రమాదం ఉందనే భయంతోనే అతని చేతులు, కాళ్లను మంచానికి కట్టేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, అతనికి అవసరమైన ఆహారం, మందులు సక్రమంగానే అందించామని ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ జయంత్ అహుజా తెలిపారు.
ఇదిలా ఉండగా, తాజాగా ఆ యువకుడు ఢిల్లీలోని షహదరాకు చెందిన 33 ఏళ్ల కపిల్‌గా గుర్తించారు. ఆస్పత్రి సిబ్బంది తమకు సరైన సమాచారం అందించలేదని, చికిత్స విషయంలో నిర్లక్ష్యం జరిగిందని అతని కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రధాన వైద్యాధికారి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కపిల్‌ను ఎంతసేపు మంచానికి కట్టేసి ఉంచారు? ఇందుకు అవసరమైన వైద్యపరమైన అనుమతులు తీసుకున్నారా? అతనికి నిరంతరం ఆహారం, నీరు, మందులు అందించారా? అతడిని పర్యవేక్షించిన సిబ్బంది ఎవరు? అనే అంశాలను కమిటీ పరిశీలించనుంది.
అంతేకాకుండా, కపిల్ మరణానికి అసలు కారణం ఏమిటనే విషయంపైనా విచారణ జరగనుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే సంబంధిత వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Leave a Reply