బీహార్ రాష్ట్రంలోని వైశాలీ జిల్లాలో జూన్ 30న సగం కాలిపోయిన స్థితిలో ఒక మృతదేహం దొరకడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో, అతనెవరో గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయితే, పోలీసుల లోతైన విచారణలో ఆ మృతదేహం సమస్తిపూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడిదని తేలింది.
చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో, ఆ యువకుడు తన మేనమామ ఇంట్లోనే పెరిగాడు. పెరిగి పెద్దయ్యాక, అతనికి తన మేనమామ కుమార్తెతో ప్రేమ చిగురించింది. ఈ ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు ఏమాత్రం నచ్చలేదు. దీనివల్ల వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఆ ప్రేమను వదిలేయమని యువకుడిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.
ఈ ప్రేమ విషయం మూడు సంవత్సరాల క్రితమే మేనమామకు తెలిసింది. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ యువకుడు వినకుండా, చెన్నైలో ఉంటూనే అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతుండేవాడు. దీనితో కోపంతో ఊగిపోయిన మామ, ఒక పక్కా ప్రణాళికతో ఆ యువకుడిని చెన్నై నుండి సమస్తిపూర్‌కు, అక్కడి నుండి పాట్నాకు రప్పించాడు. అక్కడ రెండు రోజులు మాట్లాడినా అతను పద్ధతి మార్చుకోకపోవడంతో, జూన్ 28న తన అనుచరులతో కలిసి గంగానది ఒడ్డున ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు.
గుర్తుపట్టకుండా ఉండటానికి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నిప్పు పెట్టి కాల్చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడైన మేనమామను పోలీసులు అరెస్టు చేశారు. తన కూతురు మరియు మేనల్లుడి ప్రేమ వల్ల కలిగిన ఆవేశంతోనే ఈ దారుణానికి పాల్పడ్డానని అతను ఒప్పుకున్నాడు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
