బెంగళూరు: ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య ఆదివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో హై-వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాగా, అభిమానులు మధ్యాహ్నం నుండే స్టేడియం వద్దకు భారీగా చేరుకున్నారు.
స్టేడియం పరిసరాలన్నీ జెర్సీలు, జెండాల అమ్మకాలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ఎరుపు రంగు (RCB జెర్సీ) పండుగలా కనిపించింది. మ్యాచ్‌కు ముందే ‘ఆర్సిబి.. ఆర్సిబి..’, ‘సిఎస్కె.. సిఎస్కె..’ నినాదాలతో స్టేడియం హోరెత్తిపోయింది.
300 కిలోమీటర్ల దూరం నుండి..
ఈ మ్యాచ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే, హావేరి జిల్లా రాణేబెన్నూరు నుండి దాదాపు 300 కి.మీ ప్రయాణించి వచ్చిన మంజునాథ గౌడ అనే అభిమాని మాట్లాడుతూ.. “మ్యాచ్ చూసేందుకు ఉదయాన్నే బెంగళూరు వచ్చాను. ఆర్సిబి vs సిఎస్కె మ్యాచ్ అంటే దూరం భారమే కాదు. స్టేడియం లోపలికి వెళ్లడానికి మధ్యాహ్నం 2 గంటల నుండే ఎదురుచూస్తున్నాను” అని తన ఉత్సాహాన్ని పంచుకున్నారు.
గేటు బయట స్నేహితులు.. లోపల ప్రత్యర్థులు!
చెన్నై నుండి వచ్చిన కార్తీక్ రాజా మాట్లాడుతూ తమ జట్టు గెలుపుపై ధీమా వ్యక్తం చేయగా, అతనితో ఉన్న బెంగళూరు నివాసి రాహుల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మేమిద్దరం మంచి స్నేహితులం. కానీ ఆర్సిబి-సిఎస్కె మ్యాచ్ ఉందంటే మా స్నేహం స్టేడియం గేటు వరకే.. లోపలికి వెళ్తే మేం ప్రత్యర్థులం” అని సరదాగా చెప్పుకొచ్చారు.
4 నిమిషాల్లో టిక్కెట్లు ఖతం.. డీకే శివకుమార్‌కు వినూత్న విన్నపం:
ఆన్లైన్లో టిక్కెట్లు పెట్టిన 4 నిమిషాల్లోనే అమ్ముడైపోవడంతో వేలాది మంది అభిమానులు నిరాశ చెందారు. ఈ క్రమంలో ఒక యువకుడు స్టేడియం బయట ప్లకార్డు పట్టుకుని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు ఒక వినూత్న విన్నపం చేశాడు.
“ప్రియమైన ఉప ముఖ్యమంత్రి గారూ.. నాకు, నా సోదరికి, స్నేహితులకు టిక్కెట్లు దొరకలేదు. మీ పదవీకాలం ముగిసేలోపు ఆర్సిబి అభిమానుల కోసం దయచేసి 1 లక్ష మంది కూర్చునే సామర్థ్యం గల స్టేడియం నిర్మించండి” అని అందులో కోరాడు.
చిన్నస్వామి సామర్థ్యం ఎంత?
ప్రస్తుతం ఉన్న ఎం. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం కేవలం 32,000 సీట్లు మాత్రమే. బెంగళూరుతో పాటు కర్ణాటక మూలమూలల నుండి, దేశవిదేశాల నుండి అభిమానులు ఈ మ్యాచ్‌లు చూడటానికి వస్తుంటారు. “టిక్కెట్ల కోసం ఏటా ఇంతలా పోరాటం చేయాల్సి వస్తోంది. మేం డబ్బులు ఇచ్చి, ఎంతసేపైనా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నాం.. కానీ బెంగళూరు టీమ్ క్రేజ్‌తో పోలిస్తే ఈ స్టేడియం చాలా చిన్నది” అని సిద్ధార్థ్ అనే అభిమాని అసహనం వ్యక్తం చేశారు.
