చిన్న చిన్న గొడవలకే విడాకులా..? “ఇది వేధింపు కాదు సహజమే”.. భార్యాభర్తలన్నాక అన్నీ ఉంటాయి.. కోర్టు సంచలన తీర్పు.!!

కుటుంబంలో జరిగే చిన్నపాటి గొడవలు, సాధారణ మనస్పర్థలను మానసిక వేధింపులుగా భావించి విడాకులు పొందలేరని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది.

మహారాష్ట్రకు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి, అతని భార్యకు 2003లో వివాహమైంది. కాలక్రమేణా వీరి దాంపత్య జీవితంలో కలతలు మొదలయ్యాయి. భార్య కోపిష్టి అని, తన తల్లితో నిత్యం గొడవపడుతూ తనను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు.

అయితే, ఆ పిటిషన్‌ను విచారించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా, భార్యకు నెలకు రూ.5 వేల చొప్పున భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఆ వ్యక్తి ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌ను ఆశ్రయించాడు.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే, జస్టిస్ రాజ్ వాఘోడేలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా వైవాహిక బంధంలో బాధ్యతలు మారినప్పటికీ.. ఏ సంసారంలోనైనా చిన్నపాటి గొడవలు, అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజమైన విషయమని న్యాయమూర్తులు గుర్తుచేశారు.

భార్యాభర్తల మధ్య జరిగే సాధారణ చికాకులను మానసిక వేధింపులుగా ముద్ర వేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్ట ప్రకారం విడాకులు మంజూరు చేయాలంటే.. ఆ వేధింపులు దంపతులు ఇక కలిసి జీవించలేనంత తీవ్రస్థాయికి చేరి ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. ఒకటి రెండు విడి సంఘటనల ఆధారంగా మానసిక క్రూరత్వాన్ని నిర్ధారించలేమని, మొత్తం వివాహ బంధాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే విడాకులు ఇవ్వగలమని పేర్కొంటూ భర్త దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.


Posted

in

by

Tags: