ఐదేళ్లుగా రక్త క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ 18 ఏళ్ల విద్యార్థిని.. జీవితంలో చివరిసారిగా తన స్నేహితులు, ఉపాధ్యాయులతో కలిసి తరగతి గదిలో కూర్చొని పాఠం వినాలని కోరుకుంది. ఆమె కోరిక తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఆ చిన్న ఆశను నెరవేర్చారు. అయితే ఆ ప్రత్యేక తరగతి జరిగిన కొద్ది రోజులకే ఆమె కన్నుమూయడం అందరినీ కలచివేసింది.
నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌కు చెందిన యావో యింగ్పెయ్ అనే విద్యార్థినిని అందరూ ‘బెయ్బెయ్’ అని పిలిచేవారు. ఐదేళ్ల క్రితం ఆమెకు రక్త క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనారోగ్య కారణాల వల్ల 18 ఏళ్ల వయసులోనూ తొమ్మిదో తరగతి చదువుతోంది. చికిత్స మధ్యలో ఆరోగ్యం సహకరించినప్పుడల్లా పాఠశాలకు వెళ్లి చదువుకోవడానికి ఆమె ఎంతో ఆసక్తి చూపించేది.
కూతురిని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆమెకు స్టెమ్ సెల్ మార్పిడి చికిత్స అందించేందుకు, చిన్న కుమార్తె బొడ్డు తాడు రక్తాన్ని కూడా వినియోగించినట్లు కథనంలో పేర్కొన్నారు. చికిత్స తర్వాత కొంతకాలం ఆరోగ్యం మెరుగుపడటంతో బెయ్బెయ్ తిరిగి పాఠశాలకు వెళ్లింది. కానీ సుమారు మూడు నెలల క్రితం వ్యాధి మళ్లీ తీవ్రం కావడంతో స్వగ్రామంలోని ఆసుపత్రిలో చేరింది.
ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ప్రతిరోజూ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించేవారు. ఈ క్రమంలో తన జీవితంలోని చివరి వారంలో స్నేహితులందరితో కలిసి ఒక్కసారైనా తరగతిలో కూర్చొని పాఠం వినాలని ఉందని ఆమె తన టీచర్‌కు చెప్పింది.
వెంటనే పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఆమె కోరికను నెరవేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రిలోని ఆమె గదినే తాత్కాలిక తరగతి గదిగా మార్చారు. బెలూన్లు, బొమ్మలతో గదిని అందంగా అలంకరించారు.
తీవ్రమైన జ్వరం, ఎముకల నొప్పి, ముక్కు నుంచి రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ.. ఆ ప్రత్యేక తరగతిలో బెయ్బెయ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. ఉపాధ్యాయుడు ఇంగ్లిష్ పాఠం చెబుతుంటే, తన స్నేహితులతో కలిసి ఆమె కూడా పాఠాన్ని తిరిగి చెబుతూ ఆనందంగా గడిపింది.
అయితే, ఈ ప్రత్యేక తరగతి జరిగిన కొద్ది రోజులకే.. గత నవంబర్ 7న బెయ్బెయ్ కన్నుమూసింది. ఆమె చివరి తరగతికి సంబంధించిన వీడియోను ఉపాధ్యాయుడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.
సాధారణంగా చాలామంది విద్యార్థులకు బోరింగ్‌గా అనిపించే తరగతి గది.. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఆ విద్యార్థినికి మాత్రం జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణంగా మారింది. తన స్నేహితులతో కలిసి చివరిసారిగా పాఠం విన్న ఆ దృశ్యాలు నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

Leave a Reply