కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులకు వ్యతిరేకంగా చర్యలు తీవ్రతరమయ్యాయి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో, పశ్చిమ బెంగాల్లో ఒక టీఎంసీ స్థానిక నాయకుడు పోలీసులకు భయపడి బట్టల దుకాణం గోడౌన్‌లోని చీరల కుప్పలో దాక్కున్న విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
పశ్చిమ బెంగాల్లో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యంగా మమతా బెనర్జీ సైతం తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఓడిపోయారు. దీని తర్వాత అక్కడ సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీఎంసీ నాయకులకు వ్యతిరేకంగా విచారణలు, అరెస్టుల పర్వం ఊపందుకుంది.
పశ్చిమ బెంగాల్
సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా, ఉదయ్‌నారాయణ్‌పూర్ పరిధిలోని బిల్సాపూర్ గ్రామానికి చెందిన బ్రహ్మానంద చక్రవర్తి, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం ప్రవేశపెట్టిన గృహ నిర్మాణ పథకం (హౌసింగ్ స్కీమ్) కింద లబ్ధిపొందిన లబ్ధిదారుల నుండి బ్రహ్మానంద చక్రవర్తి అక్రమంగా, బలవంతంగా కమీషన్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పేదల డబ్బును ఇలా అన్యాయంగా దోచుకుంటున్న అతని తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.
తిరగబడిన ప్రజలు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో, ప్రజలు అతనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. గ్రామస్తులందరూ గుంపుగా తరలివెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో బ్రహ్మానంద చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, అతడిని పట్టుకోవడానికి ఒక ప్రత్యేక బృందంతో (స్పెషల్ ఆపరేషన్) రంగంలోకి దిగారు.
చీరల చాటున దాక్కున్న టీఎంసీ నేత
పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారనే విషయాన్ని ముందే పసిగట్టిన బ్రహ్మానంద చక్రవర్తి, అక్కడి నుండి గుట్టుచప్పుడు కాకుండా పారిపోయి సమీపంలోని ఒక పెద్ద బట్టల దుకాణం గోడౌన్‌లోకి చొరబడ్డాడు. అక్కడ కట్టలు కట్టలుగా అడ్డుగా పెట్టి ఉన్న వందలాది చీరల మధ్య, ఎవరికీ అనుమానం రాకుండా ఒక పెద్ద చీరల కుప్ప లోపలికి దూరి తనను తాను పూర్తిగా దాచుకున్నాడు.
కానీ, అతని ఈ ‘చీర’ ఉపాయం అస్సలు పారలేదు. గోడౌన్ అంతటా అంగుళం అంగుళం వెతికిన పోలీసులు, చివరికి ఆ చీరల కుప్పను తొలగించగా లోపల దాక్కున్న బ్రహ్మానంద చక్రవర్తి కంటికి చిక్కాడు. చీరల మధ్యలో దాక్కున్న అతని చేతిని పట్టుకుని పోలీసులు బయటకు లాగి, స్పాట్లోనే అరెస్ట్ చేశారు.
ట్రెండింగ్
అతను చీరల కుప్ప నుండి బయటకు వస్తున్న ఆ వింత దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. పోలీసులకు భయపడి చీరల మధ్య దాక్కున్న అతని తీరును నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలావుండగా, గతంలో పశ్చిమ బెంగాల్‌లోని కోచ్ బెహార్ ప్రాంతంలో షాహిదుల్ మియా అనే మరో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని ఆగ్రహించిన గ్రామస్తులు తరుమగా, అతను భయపడి తన ఇంటి మంచం కింద దాక్కున్నాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు అతడిని మంచం కింద నుండి ఈడ్చుకుంటూ వచ్చి అరెస్ట్ చేసిన సంఘటనను ఈ సందర్భంగా కొందరు గుర్తు చేసుకుంటున్నారు.
