చెక్ పోస్ట్ వద్ద పేలుడు పదార్థాల వాహనం పేల్చివేత; 11 మంది సైనికుల మృతి, పలువురికి గాయాలు

ఖైబర్ పఖ్తున్ఖ్వా పేలుడు: పాకిస్థాన్‌లోని అశాంత ప్రాంతం ఖైబర్ పఖ్తున్ఖ్వా మరోసారి భీకర ఉగ్రదాడితో వణికిపోయింది. వాయువ్య జిల్లా బాజౌర్‌లో తిరుగుబాటుదారులు భద్రతా దళాల ఉమ్మడి చెక్ పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పిరికిపంద దాడికి పాల్పడ్డారు. ఈ ఆత్మహతి దాడిలో పాకిస్థాన్ పోలీసులు మరియు భద్రతా దళాలకు చెందిన 11 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.

దాడి జరిగిన తీరు: పాక్ సైనిక విభాగం (ISPR) ప్రకారం, ఈ దాడి ఫిబ్రవరి 16, 2026న జరిగింది. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన ఒక వాహనాన్ని నేరుగా చెక్ పోస్ట్ గోడకు ఢీకొట్టారు. ఈ పేలుడు ఎంత శక్తివంతంగా ఉందంటే, చెక్ పోస్ట్ భవనం మొత్తం కూలిపోయింది. శిథిలాల కింద పడి 11 మంది సైనికులు అక్కడికక్కడే మరణించారు. ఎదురు కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లు సైన్యం పేర్కొంది. ఈ ఘటనలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

భారత్‌పై నిందలు: తన అంతర్గత భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్ మరోసారి భారత్‌పై ఆరోపణలు చేసే ‘సిగ్గుమాలిన’ ప్రయత్నం చేసింది. అయితే, పాకిస్థాన్ తాను పెంచి పోషించిన ఉగ్రవాద గ్రూపుల నుండే ఇప్పుడు ముప్పును ఎదుర్కొంటోంది అన్నది జగమెరిగిన సత్యం.

పెరుగుతున్న హింస: రిపోర్ట్స్ ప్రకారం, పాకిస్థాన్‌లో హింస కారణంగా మరణించిన వారి సంఖ్య 2024లో 1,620 ఉండగా, 2025 నాటికి అది 2,331కి పెరిగింది. ప్రస్తుతం పాక్ సైన్యం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం ‘శానిటైజేషన్ ఆపరేషన్’ నిర్వహిస్తోంది.


Posted

in

by

Tags: