బంగ్లాదేశ్ వార్తలు: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఝినైదా జిల్లాలో ఒక 40 ఏళ్ల హిందూ వితంతువుపై జరిగిన దాడి క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచింది. ఆ మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా, చెట్టుకు కట్టేసి శారీరకంగా హింసించారు. అవమానించాలనే ఉద్దేశంతో ఆమె జుట్టును కూడా కత్తిరించారు. ఇది కేవలం ఒక నేరం మాత్రమే కాదు, మానవత్వాన్ని ప్రశ్నించే అనాగరిక చర్య.
బంగ్లాదేశ్లో మైనారిటీ మహిళలు ఎదుర్కొంటున్న భయానక పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోంది. బాధితురాలు గత రెండున్నర ఏళ్లుగా నిరంతరం వేధింపులకు గురవుతోంది. ఆమె నిలదీయడంతో, నిందితులు శిక్షించాలనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
అసలు ఏం జరిగింది? ఈ దారుణ ఘటన శనివారం రాత్రి ఝినైదా జిల్లాలోని కాళీగంజ్ ప్రాంతంలో జరిగింది. బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం షాహీన్ మరియు అతని సోదరుడి నుండి 20 లక్షల టాకా(బంగ్లాదేశ్ కరెన్సీ)లకు రెండు అంతస్తుల ఇల్లు మరియు సుమారు 300 డెసిమల్ భూమిని కొనుగోలు చేసింది. భూమి కొన్నప్పటి నుండి షాహీన్ ఆమెపై కన్నేసి, వేధించడం మొదలుపెట్టాడు.
