మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఇంటి ముందు చెత్త వేయడంపై తలెత్తిన వివాదం తీవ్ర విషాదంగా ముగిసింది.
పొరుగింటి వ్యక్తితో జరిగిన మాటామాటా పెరిగి భౌతిక దాడిగా మారడంతో భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలనీలో ఆగస్టు 15న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, మొదట భార్య, ఆ తర్వాత భర్త చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఘటన జరిగిన రోజు ఉదయం మనీషా కేసరేకర్ తన ఇంటి ముందు చెత్త వేసి ఉండటాన్ని గమనించింది. దీనిపై ఆమె 52 ఏళ్ల పొరుగింటి వ్యక్తి ఫరీద్ అబ్దుల్ షేక్‌ను నిలదీసింది. వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుండగా, గొడవను ఆపేందుకు మనీషా భర్త మోహన్ నాగప్ప కేసరేకర్ బయటకు వచ్చాడు. ఆ సమయంలో వివాదం మరింత ముదిరినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఆగ్రహంతో ఊగిపోయిన ఫరీద్ తన ఇంట్లోకి వెళ్లి సుత్తి, కత్తిని తీసుకువచ్చి దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మోహన్ తలపై సుత్తితో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. భర్తను కాపాడేందుకు ప్రయత్నించిన మనీషాపై కూడా అతడు పలుమార్లు కత్తితో దాడి చేశాడు. దాడిని అడ్డుకునేందుకు వారి మైనర్ కూతురు ప్రయత్నించగా, నిందితుడు సైకిల్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్ర గాయాలపాలైన దంపతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 16 సాయంత్రం మనీషా చికిత్స పొందుతూ మృతి చెందగా, 45 ఏళ్ల మోహన్ ఐసీయూలో చికిత్స పొందుతూ ఆగస్టు 18న ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఫరీద్ అబ్దుల్ షేక్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మృతులకు 17 ఏళ్ల కుమార్తె, 10 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కర్ణాటకకు చెందిన ఈ కుటుంబం గత పదేళ్లకు పైగా సాంగ్లీలో భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
