“చెబితే విను.. లేదంటే అంతే సంగతులు!”.. హెచ్చరికను మీరి వీడియో తీసిన బంగ్లాదేశ్ యువకుడు; అదిరిపోయే సమాధానమిచ్చిన బిఎస్ఎఫ్ జవాన్.. వైరల్ వీడియో!

భారత-బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతను పర్యవేక్షిస్తున్న బిఎస్ఎఫ్ (BSF) జవాన్ ఒకరు, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వీడియో తీస్తున్న యువకుడిపై కాల్పులు జరిపిన పాత వీడియో సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతోంది.

త్రిపుర సరిహద్దు ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనలో, బంగ్లాదేశ్‌కు చెందిన ఒక యువకుడు సరిహద్దుకు అతి సమీపంలోకి వచ్చి, నిషేధిత ప్రాంతాలను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించడం ప్రారంభించాడు.

అక్కడ కాపలాగా ఉన్న బిఎస్ఎఫ్ జవాన్, “వీడియో తీయవద్దు.. మాట వినకపోతే కాల్చేస్తాను” అని పలుమార్లు హెచ్చరించారు. అయినా సరే, ఆ యువకుడు అవేమీ పట్టించుకోకుండా వీడియో తీయడం కొనసాగించాడు. దీంతో ఆగ్రహించిన జవాన్, “నిన్ను ఇప్పుడే కాల్చి పారేస్తాను” అని అరుస్తూ తన తుపాకీతో కాల్పులు జరిపారు.

తుపాకీ శబ్దం వినగానే భయంతో వణికిపోయిన ఆ యువకుడు కేకలు వేస్తూ బంగ్లాదేశ్ సరిహద్దులోకి పరుగులు తీశాడు. ఇది పాత వీడియో అయినప్పటికీ, ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ‘దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదు’ అంటూ నెటిజన్లు ఆ జవాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Posted

in

by

Tags: