భారత జట్టు మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, ప్రస్తుత టోర్నీలో తన నాలుగో అర్ధశతకాన్ని నమోదు చేయడమే కాకుండా, విరాట్ కోహ్లీ పాపులర్ ‘నా బ్యాట్ సమాధానం చెబుతుంది’ (Let the bat talk) స్టైల్‌లో సంబరాలు చేసుకుని అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
టోర్నీ ఆద్యంతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్, ఈ మ్యాచ్‌లోనూ తన అసాధారణ ఆటతీరును కనబరిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కాస్త నిదానంగా ఆడిన అతనికి, ఒక దశలో ఊహించని షాక్ తగిలింది. లోపలికి దూసుకొచ్చిన ఒక బంతి అతని ముంజేతికి బలంగా తగలడంతో ఆర్యవీర్ నొప్పితో విలవిలలాడాడు. వెంటనే మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన వైద్య బృందం అతని చేతికి కట్టు కట్టింది. అయినప్పటికీ, గాయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా బ్యాటింగ్ కొనసాగించాలని ఆర్యవీర్ నిర్ణయించుకున్నాడు.
చేతికి తగిలిన గాయమే అతని ఆటలో కొత్త వేగాన్ని నింపినట్లయింది. గాయం కారణంగా కొన్ని షాట్లు ఆడేటప్పుడు కింది చేతిని బ్యాట్ నుంచి వదిలేస్తూనే, ఎంతో ఆత్మవిశ్వాసంతో బౌలర్లను ఎదుర్కొన్నాడు. 8 బౌండరీలతో ప్రత్యర్థి బౌలింగ్‌ను చెండాడిన అతను, రిజ్వానుల్లా వేసిన బంతిని ఫైన్ లెగ్ దిశగా తరలించి సింగిల్ తీయడం ద్వారా తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
హాఫ్ సెంచరీ పూర్తి కాగానే, తన బ్యాట్‌ను పైకెత్తి చూపిస్తూ ‘బ్యాటే మాట్లాడుతుంది’ అన్నట్లుగా సైగ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ దృశ్యం, గత 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై పెర్త్ మైదానంలో సెంచరీ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ చేసిన చారిత్రాత్మక సెలబ్రేషన్‌ను అభిమానులకు గుర్తుకు తెచ్చింది. విరాట్ కోహ్లీయే తన రోల్ మోడల్ అని ఆర్యవీర్ సెహ్వాగ్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, తన ఆరాధ్య క్రికెటర్ శైలిలోనే అతను సంబరాలు చేసుకోవడం క్రికెట్ ప్రేమికుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.

Leave a Reply