“చేతికి సంకెళ్లు, చెవిలో ఫోన్!” పోలీసులకే షాకిచ్చిన ఖైదీ! – కోర్టు ప్రాంగణంలోనే బహిరంగంగా జరిగిన ఘటన.. వైరల్ ..!!”

ముంబై సెషన్స్ కోర్టు ప్రాంగణంలో పోలీసుల భద్రత నడుమ చేతులకు సంకెళ్లతో తీసుకువచ్చిన ఓ ఖైదీ, ఎంతో దర్జాగా మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చి తీవ్ర దుమారం రేపింది.

కోర్టు భద్రతా నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించే విధంగా జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకువచ్చిన సదరు నిందితుడు, చేతులకు బేడీలు వేసి ఉన్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా మొబైల్ ఫోన్‌లో చాలాసేపు మాట్లాడాడు. పక్కనే నిల్చున్న ఓ కానిస్టేబుల్ ఆ ఫోన్‌ను తనకు ఇచ్చేయాలని సైగ చేయడం, మాట్లాడటం పూర్తయ్యాక ఆ ఖైదీ పోలీసులకే ఫోన్ తిరిగి ఇవ్వడం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డైంది. సాధారణంగా న్యాయస్థానాల కస్టడీలో ఉండే ఖైదీలు ఎవరూ మొబైల్ ఫోన్లు వాడటానికి ఎలాంటి అనుమతి ఉండదు. అలాంటిది భద్రతా విధుల్లో ఉన్న పోలీసుల కళ్ల ముందే నిషేధిత మొబైల్ ఫోన్ ఖైదీ చేతుల్లోకి ఎలా వెళ్లిందనే దానిపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఖైదీకి ఫోన్ ఇచ్చింది ఎవరు? అతను ఎవరితో మాట్లాడాడు? ఈ సంభాషణకు అతని కేసుకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణాల్లో విచారణ చేపట్టాలని నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఖైదీలు బయటి వ్యక్తులతో మాట్లాడటం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే లేదా కేసును పక్కదారి పట్టించే ప్రమాదం ఉన్నందున ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోర్టుల్లో కఠినమైన భద్రతా నిబంధనలు ఉన్నప్పటికీ, పోలీసులే నిందితుడికి సహకరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరల్ వీడియోపై ముంబై పోలీసులు త్వరలోనే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


Posted

in

by

Tags: