ఆఫీసు పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత పాటించడం చాలామందికి సవాలుగా మారుతున్న తరుణంలో, ముందుగా ఆమోదించిన సెలవును తగ్గించుకోవాలని మేనేజర్ ఒత్తిడి చేసిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
బెంగళూరులోని వస్త్ర పరిశ్రమలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్య ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి నెట్టింట పోస్ట్ చేశారు. తాను కుటుంబ వ్యాపారంలో ఉన్నానని, తన భార్య ఓ పెద్ద కార్పొరేట్ సంస్థలో 5 నుంచి 6 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తోందని ఆయన పేర్కొన్నారు.
జనవరి నెలలో ఇద్దరూ కలిసి జపాన్ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకోగా, అందుకోసం మూడు నెలల ముందే తన భార్య రెండు వారాల సెలవుకు దరఖాస్తు చేసిందని, ఎలాంటి అభ్యంతరం లేకుండా దానికి ఆమోదం కూడా లభించిందని తెలిపారు. అంతేకాకుండా, వీసా ప్రక్రియ కోసం సంస్థ హెచ్ఆర్ (HR) విభాగం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కూడా జారీ చేసింది.
సెలవుకు ఆమోదం లభించడంతో ఆ దంపతులు వీసా పొంది, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ అన్నీ పూర్తి చేశారు. అయితే, ప్రయాణం దగ్గరపడుతున్న సమయంలో మేనేజర్ అకస్మాత్తుగా తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గి, రెండు వారాల సెలవు మరీ ఎక్కువని, దానిని 8 నుంచి 10 రోజులకు తగ్గించుకోవాలని లేదా పర్యటన మధ్యలో అక్కడి నుంచే పనిచేయాలని ఒత్తిడి చేశారు.
ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న దాదాపు 50 నుంచి 60 సెలవులు ఖాతాలో ఉన్నప్పటికీ, అందులో చిన్న భాగాన్ని మాత్రమే వాడుకోవాలనుకున్న తరుణంలో ఇలాంటి షరతు పెట్టడం గమనార్హం. తమ కుటుంబ వ్యాపారంలో జనవరిలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుందనే ఆ సమయాన్ని ఎంచుకున్నామని, ఆఫీసులో సహోద్యోగులకు ప్రయాణ వివరాలు తెలియకుండా మేనేజర్‌ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తన భార్య అయోమయంలో ఉందని ఆయన వాపోయారు.
ఈ పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్ కావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను, సలహాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే ఆమోదించిన సెలవు ఆధారంగానే వ్యక్తిగత, ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నామనే విషయాన్ని మేనేజర్‌కు వినయంగా వివరించాలని చాలామంది సూచించారు.
అదే సమయంలో, సరైన వర్క్ వీసా లేకుండా విదేశాల నుంచి ఆఫీసు పని చేయడం సంస్థ నిబంధనలకు, చట్టాలకు విరుద్ధమని, విదేశీ ఇంటర్నెట్ కనెక్షన్లో ఆఫీసు కంప్యూటర్ వాడితే సెక్యూరిటీ అలర్ట్‌లు వచ్చి ఉద్యోగానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరించారు. ఒకవేళ సెలవు తగ్గించుకోవాలని సంస్థ బలవంతం చేస్తే, బుకింగ్స్ రద్దు వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని సంస్థే భరించాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Leave a Reply