తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదంటారు. కానీ అదే తల్లి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఒక చిన్నారి ప్రదర్శించిన ధైర్యసాహసాలు మాటలకు అందనివి.
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా చిప్లూన్ ప్రాంతంలో ఉన్న వాశిష్టి నదీ తీరంలో జరిగిన ఓ ఘటన ఈ నిజాన్ని మరోసారి నిరూపించింది.
ఎప్పటిలాగే తన తల్లితో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లిన పదేళ్ల చిన్నారి స్వర్ణి, అనుకోకుండా జరిగిన ఒక భయానక దాడి నుంచి తన తల్లి ప్రాణాలను కాపాడిన తీరు స్థానికులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
నందిని భూపేంద్ర పవార్ అనే 35 ఏళ్ల మహిళ సాయంత్రం సమయంలో తన కుమార్తె స్వర్ణితో కలిసి వాశిష్టి నది వద్ద బట్టలు ఉతుకుతోంది. ఆ సమయంలో నీటిలో నక్కి ఉన్న ఒక భారీ మొసలి హఠాత్తుగా నందినిపై దాడి చేసి, ఆమె కాలును తన పదునైన దవడలతో పట్టుకుంది.
ఒక్క క్షణంలో ఏం జరుగుతుందో అర్థంకాక ఆ తల్లి భయంతో కేకలు వేసింది. మొసలి ఆమెను లోతైన నీటిలోకి లాగడానికి ప్రయత్నించగా, తీవ్ర ప్రాణభయంలోనూ ధైర్యం కోల్పోని నందిని.. నదీ తీరంలో ఉన్న ఒక పెద్ద బండరాయిని గట్టిగా పట్టుకుని ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడింది.
తన తల్లి మొసలి నోట్లో చిక్కుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటం చూసిన చిన్నారి స్వర్ణి భయంతో పారిపోకుండా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించింది. తల్లిని ఎలాగైనా కాపాడాలనే ఒకే ఒక్క లక్ష్యంతో వెంటనే పరుగున వచ్చి తల్లి చేతులను గట్టిగా పట్టుకుంది.
తనకున్న కొద్దిపాటి బలమంతా కూడదీసుకుని, మొసలి పట్టు నుంచి తల్లిని ఒడ్డు వైపునకు సర్వశక్తులా లాగింది. చిన్నారి చూపిన ఈ అసాధారణ తెగువ, పోరాటం ముందు మొసలి వారిని నీటిలోకి లాగలేకపోయింది. చివరకు మొసలి పట్టు విడిపించి తన తల్లిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది ఆ పదేళ్ల బాలిక.
ఈ దాడిలో గాయపడిన నందిని ప్రస్తుతం కామథే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించడమే కాకుండా, చిన్నారి స్వర్ణి ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రశంసించారు.
వర్షాకాలం కావడంతో వాశిష్టి నదిలో మొసళ్ల సంచారం ఎక్కువగా ఉంటుందని, స్థానికులు నదీ తీరాలకు వెళ్లడం, బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం వంటివి మానుకోవాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. మృత్యుముఖంలో ఉన్న తల్లి ప్రాణాలను కాపాడేందుకు ఆ చిన్నారి చూపిన సాహసం తల్లి ప్రేమకు కుమార్తె ఇచ్చిన గొప్ప కానుకగా అందరూ కొనియాడుతున్నారు.
