అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఏప్రిల్ 2026లో తన ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్’ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక శక్తి సమతుల్యతలో వస్తున్న మార్పులను ఈ గణాంకాలు స్పష్టంగా చూపుతున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 124 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఇది గతేడాది కంటే 6.4 ట్రిలియన్ డాలర్ల పెరుగుదల. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 340 బిలియన్ డాలర్ల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.
అగ్రస్థానంలో అమెరికా – చైనాతో పెరిగిన అంతరం: IMF ప్రకారం, 2026లో అమెరికా ఆర్థిక వ్యవస్థ 32.38 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదంటే.. చైనా (20.9 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4.7 ట్రిలియన్ డాలర్లు) మరియు జపాన్ (4.4 ట్రిలియన్ డాలర్లు) ఈ మూడు దేశాల ఆర్థిక వ్యవస్థలను కలిపినా అమెరికా కంటే తక్కువగానే ఉంది. అమెరికా మరియు చైనా మధ్య ఇప్పుడు 11.5 ట్రిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉంది.
చైనా వెనకడుగు: కొన్నేళ్ల క్రితం వరకు చైనా 2030 లేదా 2035 నాటికి అమెరికాను అధిగమిస్తుందని విశ్లేషకులు భావించారు. కానీ తాజా గణాంకాలు ఆ వ్యత్యాసం తగ్గడానికి బదులు పెరుగుతోందని చెబుతున్నాయి. చైనాలోని రియల్ ఎస్టేట్ సంక్షోభం, ఎగుమతులపై టారిఫ్ ఒత్తిడి మరియు తగ్గుతున్న శ్రామిక శక్తి వంటివి చైనా వృద్ధిని మందగించేలా చేశాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 43% వాటా రెండు దేశాలదే: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 124 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనాల వాటానే 53 ట్రిలియన్ డాలర్లు. అంటే ప్రపంచంలోని 43% ఆర్థిక వ్యవస్థ ఈ రెండు దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంది. జర్మనీ, జపాన్, భారత్ వంటి మిగిలిన 190కి పైగా దేశాల వాటా కేవలం 57% మాత్రమే.
భారత్ ఆరో స్థానానికి పతనం: గత కొన్నేళ్లలో నామినల్ జీడీపీ (Nominal GDP) ఆధారంగా భారత్ నాలుగో స్థానానికి చేరుకుని బ్రిటన్, జపాన్‌లను వెనక్కి నెట్టింది. కానీ ఏప్రిల్ 2026 గణాంకాల ప్రకారం, భారత్ ఆరో స్థానానికి పడిపోయింది. జపాన్, బ్రిటన్ మళ్లీ భారత్‌ను అధిగమించాయి. అయితే, దీని అర్థం భారత్ బలహీనపడిందని కాదు. భారత్ జీడీపీ వృద్ధి చెందుతున్నప్పటికీ, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం డాలర్ ఆధారిత జీడీపీపై ప్రభావం చూపింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగడం భారత్ దిగుమతి బిల్లుపై భారాన్ని పెంచింది.
