చైనా ప్రజల మనస్సుల్లో నేటికీ జీవించి ఉన్న భారతీయుడు.! 72 గంటలు నిద్రపోకుండా ప్రాణాలను కాపాడిన వైద్యుడి కథ. విగ్రహం ప్రతిష్టించి పూజిస్తున్న చైనా ప్రజలు..!

భారత్ – చైనాల మధ్య రాజకీయం మరియు సరిహద్దు అంశాలపై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలలో మానవత్వానికి ప్రతీకగా నేటికీ స్మరించుకునే ఒక భారతీయుడు ఉన్నారు.

మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్‌లో జన్మించిన డాక్టర్ ద్వారాకనాథ్ కోట్నీస్, చైనా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో విగ్రహం, స్మారక చిహ్నం నిర్మించారు.

1938వ సంవత్సరంలో జపాన్ – చైనా యుద్ధ సమయంలో చైనాకు సహాయం చేయడానికి భారత జాతీయ కాంగ్రెస్ తరఫున 5 మంది సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని పంపారు. అందులో 28 ఏళ్ల శస్త్రచికిత్స నిపుణుడైన (సర్జన్) కోట్నీస్ కూడా ఉన్నారు. యుద్ధపు కఠినమైన పరిస్థితుల్లోనూ రణరంగానికి వెళ్తూ, పరిమిత వైద్య వసతుల నడుమ గాయపడిన చైనా సైనికులకు వరుసగా చికిత్స అందించారు.

1940వ సంవత్సరంలో జరిగిన తీవ్రమైన యుద్ధ సమయంలో, వరుసగా 72 గంటల పాటు విరామం లేకుండా వందలాది మంది సైనికులకు శస్త్రచికిత్సలు చేసినట్లు ఆయన చరిత్ర పేర్కొంటోంది. ఆ సమయంలో తన తండ్రి మరణించిన వార్త వచ్చినప్పటికీ, ఆయన తన విధులను కొనసాగించారు. నిరంతర శరీర అలసట, నిద్రలేమి మరియు ఇన్ఫెక్షన్ల వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది. చివరికి 1942వ సంవత్సరంలో, తన 32వ ఏట చైనా గడ్డపైనే కన్నుమూశారు.

కోట్నీస్ మరణం చైనా ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ దేశ నాయకుడు మావో జెడాంగ్ ఆయనకు సంతాపం తెలిపారు. నేటికీ చైనాలో ఆయన జ్ఞాపకార్థం నిర్మించిన ప్రదేశాలలో ప్రజలు నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. సరిహద్దులను, భాషలను దాటి మానవత్వం కోసం సేవ చేసిన ఒక భారతీయ వైద్యుడి కథ, ఇన్నేళ్ల తర్వాత కూడా చైనాలో స్మరించుకోవడం విశేషం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *