లక్నో: తన కోడలిని మూడు రోజుల పాటు గదిలో బంధించి, లైంగికంగా వేధించిన ఆరోపణలపై సీనియర్ రైల్వే ఇంజనీర్ ముఖేష్ కుమార్ తివారీ (58)ని పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న నిందితుడు, ఆలంబాగ్‌లోని రైల్ కోచ్ రిపేర్ వర్క్‌షాప్ సమీపంలో తిరుగుతున్నట్లు అందిన రహస్య సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలికి 2023 నవంబర్‌లో ముఖేష్ కుమార్ కుమారుడు అభిషేక్ తివారీతో వివాహమైంది. వివాహమైన మొదటి రోజు నుంచే ఆ మహిళా వరకట్న వేధింపులు, శారీరక దాడులు మరియు బలవంతంగా మద్యం తాగించడం వంటి చిత్రహింసలను ఎదుర్కొంది. 2024 ఏప్రిల్ నెలలో పుట్టింటి నుంచి తిరిగి వచ్చిన ఆమెకు, మామ ముఖేష్ కుమార్ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, గదిలో బంధించి మూడు రోజుల పాటు లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఒక అవకాశాన్ని చూసుకుని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో అధికారులు ఆమెను కాపాడారు.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, తన భర్త మరియు మరిది స్నేహితులు పాల్గొనే పార్టీలలో తనను బలవంతంగా పాల్గొనేలా చేసేవారని, దీనిపై మామకు ఫిర్యాదు చేస్తే.. అవి “ధనికుల విలాసాలు” (Rich people’s entertainment) అని కొట్టిపారేశాడని ఆమె వాపోయింది. మొదట వరకట్న వేధింపులు మరియు బెదిరింపుల కేసుగా నమోదైన ఈ వ్యవహారంలో, దర్యాప్తులో వెలుగుచూసిన కొత్త సాక్ష్యాల ఆధారంగా అత్యాచారం సెక్షన్లను జోడించి, ప్రస్తుతం నిందితుడైన మామను అరెస్టు చేశారు.
