కర్ణాటక రాష్ట్రం దావణగెరె తాలూకా పరిధిలోని బేతూరు గ్రామంలో, భర్త చేతిలో దారుణ దాడికి గురైన 25 ఏళ్ల నిండు గర్భిణీ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మృతి చెందిన బసమ్మ, ఆమె భర్త నింగరాజ్ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. ప్రేమించుకున్న వీరు, రెండు కుటుంబాల అంగీకారంతో 4-5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న ఒక పాప ఉంది.
ఈ నేపథ్యంలో, గత కొద్ది రోజులుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బసమ్మ నిండు గర్భిణీ కావడంతో కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో, ఒక చిన్న విషయానికి నింగరాజ్ ఆమెపై దారుణంగా దాడి చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన బసమ్మను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను కిమ్స్ (KIMS) ఆసుపత్రికి మార్చారు.
అక్కడ ఐసీయూ (ICU)లో కోమాలో ఉంటూనే బసమ్మ ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, 8 రోజుల పాటు అపస్మారక స్థితిలో మృత్యువుతో పోరాడిన ఆమె, తాను కన్న బిడ్డను కళ్లారా చూడకుండానే పరితాపకరంగా కన్నుమూసింది.
బసమ్మ మృతి చెందడంతో, ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన నింగరాజ్, దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా, 6 రోజుల పసికందును, 3 ఏళ్ల కూతురును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం తెలుసుకున్న బసమ్మ కుటుంబ సభ్యులు, ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి నింగరాజ్ ఇంటి ముందు ఉంచి 2 రోజుల పాటు ఆందోళన చేశారు. అతను రాకపోవడంతో, దావణగెరె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు శవపరీక్ష (పోస్ట్మార్టం) నిర్వహించి, పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త నింగరాజ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తల్లిని కోల్పోయి అనాథలైన 6 రోజుల పసికందు, 3 ఏళ్ల చిన్నారి భద్రతపై ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Leave a Reply