ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని బహరాంపూర్ ప్రాంతంలో, మద్యం దుకాణం ఎదుట ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి, మురుగు కాలువలోకి తోసేసిన దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ అమానుష ఘటనను అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ వీడియో నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
చితకబాది మురుగు కాలువలోకి విసిరేసిన వైనం:
ఘటన జరిగిన రోజు మద్యం దుకాణం సమీపంలో నిలబడి ఉన్న కొందరు యువకుల మధ్య అకస్మాత్తుగా వాగ్వాదం మొదలైంది.
ఆ సమయంలో పూర్తి మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు, ఒక యువకుడిని నిర్దాక్షిణ్యంగా చితకబాదారు.
అంతటితో ఆగకుండా, తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని బలవంతంగా పక్కనే ఉన్న మురుగు కాలువ (డ్రైనేజీ) లోకి విసిరేశారు.
చుట్టూ ఎంతోమంది జనం నిలబడి చోద్యం చూస్తున్నారే తప్ప.. ఎవరూ ఆ దాడిని అడ్డుకోవడానికి గానీ, బాధితుడిని కాపాడటానికి గానీ ముందుకు రాలేదని వీడియో దృశ్యాల ద్వారా స్పష్టమవుతోంది.
రంగంలోకి దిగిన పోలీసులు:
ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పోలీసుల దృష్టికి వెళ్లడంతో, ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ దాడికి పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడిని ‘షిప్పు’గా గుర్తించామని, మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
