జనగణన పేరుతో ఇంట్లోకి చొరబడిన ముఠా..! పట్టపగలే భయానక దోపిడీ.. అరగంట పాటు వృద్ధురాలిని బందీగా ఉంచి.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన..!!

జార్ఖండ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జనగణన సిబ్బందిగా నటించిన దుండగులు పట్టపగలే ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

ఘటన జరిగిన సమయంలో బి.ఎస్. పిళ్లై భార్య లీలావతి అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అదే సమయంలో ఓ మహిళ ఇంటికి వచ్చి.. తాను జనగణన శాఖ ఉద్యోగినని పరిచయం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించింది. కొద్దిసేపటి తర్వాత మరో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి లీలావతిని బందీగా పట్టుకున్నారు.

సుమారు అరగంట పాటు ఆమెను బందీగా ఉంచిన దుండగులు, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవిపోగులను లాక్కున్నారు. వారిని అడ్డుకునేందుకు లీలావతి కేకలు వేయడంతో ఆగ్రహించిన దుండగులు ఆమెపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె నోటికి తీవ్ర గాయమై, ఓ పంటి కూడా విరిగిపోయింది.

దోపిడీ చేసిన అనంతరం లీలావతిని ఇంటి బాల్కనీలోకి తీసుకెళ్లి అక్కడే తాళం వేసి.. ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు.

బాల్కనీలో చిక్కుకుపోయిన లీలావతి గట్టిగా కేకలు వేయడంతో.. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. అనంతరం ఆమె భర్తకు, మాంగో పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

జనగణన సిబ్బందిగా నటించి ఇంట్లోకి ప్రవేశించిన మహిళతో పాటు మరో ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Posted

in

by

Tags: