అక్టోబర్ ప్రారంభం కాగానే సోషల్ మీడియాలో “వింటర్ ఆర్క్” (Winter Arc) అనే సరికొత్త ట్రెండ్ జోరుగా చర్చనీయాంశమవుతోంది.
నూతన సంవత్సరం వచ్చాక అలవాట్లను మార్చుకుందాం అని ఎదురుచూడకుండా.. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే 90 రోజులను సద్వినియోగం చేసుకుంటూ తమను తాము మెరుగుపరుచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. అంటే జనవరి 1వ తేదీన మార్పును మొదలుపెట్టే బదులు, దానికి ముందే ఆ సాధనను ప్రారంభించడం అన్నమాట.
దీనికి సంబంధించి ప్రత్యేకించి ఎలాంటి కఠిన నిబంధనలూ లేవు. ఎవరికి వారు తమ అవసరాలకు తగిన లక్ష్యాలను ఎంచుకోవచ్చు. రోజూ పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, రన్నింగ్ లేదా వాకింగ్ ప్రారంభించడం, అనవసరంగా స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించడం, నిద్ర సమయాలను క్రమబద్ధీకరించడం లేదా ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం వంటి రకరకాల లక్ష్యాలను ఎంచుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే.. చిన్న మార్పునైనా రోజూ క్రమం తప్పకుండా ఆచరించడమే.
ఇందులోని “ఆర్క్” (Arc) అనే పదం సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కామిక్స్ కథల్లో పాత్రలలో వచ్చే క్రమమైన మార్పును సూచించే “క్యారెక్టర్ ఆర్క్” (Character Arc) అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిందని చెబుతున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి ఒకరి అలవాట్లు, జీవనశైలిలో క్రమంగా సానుకూల మార్పు తెచ్చుకుని.. జనవరి వచ్చేసరికి ఆ మార్పును స్వయంగా అనుభవపూర్వకంగా చూడటమే దీని నేపథ్యం.
ఈ ఛాలెంజ్ ముఖ్యంగా యువతరం, ఫిట్నెస్ మరియు వ్యక్తిత్వ వికాసం (Self-improvement) కంటెంట్‌ను ఫాలో అయ్యేవారిలో అమితమైన ఆదరణ పొందుతోంది. 90 రోజుల కాలపరిమితి లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత పెట్టేందుకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాకూడదని.. నిజమైన మార్పు అనేది పోస్టులు పెట్టడంలో కాదు, రోజువారీ అలవాట్లను నిబద్ధతతో కొనసాగించడంలోనే ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Leave a Reply