జనాభా గణనలో మిమ్మల్ని అడిగే ఆ 33 ప్రశ్నలు ఇవే.. వివరాలు వెల్లడించిన ప్రభుత్వం, 12వ నంబర్ ప్రశ్న చాలా ముఖ్యం!

దేశంలో జనాభా గణన (Census) ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో, మిమ్మల్ని ఏయే ప్రశ్నలు అడుగుతారో అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో కూడిన పూర్తి జాబితాను విడుదల చేసింది. గణన అధికారులు ఇంటింటికీ వచ్చి ఈ వివరాలను సేకరిస్తారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈసారి కేవలం కుటుంబ సభ్యుల సంఖ్యను లెక్కించడమే కాకుండా, మీ వద్ద ఏ వాహనాలు ఉన్నాయి, మీరు ఏ రకమైన ఆహార ధాన్యాలు తింటారు, ఇంటర్నెట్ వాడుతున్నారా లేదా? వంటి ఆసక్తికర విషయాలను కూడా అడగనున్నారు.

కుటుంబ యజమాని వివరాలతో పాటు మీ జీవనశైలి, ఇంట్లోని సౌకర్యాల గురించి ప్రభుత్వం పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తుంది. ఇంటి పైకప్పు, గోడలు దేనితో నిర్మించారు? తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న గ్యాడ్జెట్లు (ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్), వాహనాలు (కారు, బైక్) వంటి వివరాలన్నీ ఇందులో ఉంటాయి. అయితే, మొబైల్ నంబర్‌ను కేవలం జనాభా గణన సమాచారం కోసం మాత్రమే అడుగుతున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.


మిమ్మల్ని అడిగే 33 ప్రశ్నల జాబితా:
  1. భవనం నంబర్ (మున్సిపల్ లేదా స్థానిక సంస్థ లేదా జనాభా గణన నంబర్)
  2. జనాభా గణన ఇంటి నంబర్
  3. ఇంటి నేల తయారీకి ఉపయోగించిన ప్రధాన పదార్థం
  4. ఇంటి గోడల తయారీకి ఉపయోగించిన ప్రధాన పదార్థం
  5. ఇంటి పైకప్పు తయారీకి ఉపయోగించిన ప్రధాన పదార్థం
  6. ఇంటి వినియోగం (దేని కోసం వాడుతున్నారు?)
  7. ఇంటి పరిస్థితి (స్థితిగతులు)
  8. కుటుంబ క్రమ సంఖ్య
  9. కుటుంబంలో సాధారణంగా నివసించే వ్యక్తుల మొత్తం సంఖ్య
  10. కుటుంబ యజమాని పేరు
  11. కుటుంబ యజమాని లింగం
  12. కుటుంబ యజమాని ఎస్సీ (SC) / ఎస్టీ (ST) / ఇతరులకు చెందినవారా? (ఇది కీలకమైన ప్రశ్న)
  13. ఇంటి యాజమాన్య స్థితి (సొంతమా? అద్దెదా?)
  14. కుటుంబ నివాసం కోసం అందుబాటులో ఉన్న గదుల సంఖ్య
  15. కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య
  16. తాగునీటి ప్రధాన వనరు
  17. తాగునీటి వనరు లభ్యత
  18. వెలుతురు (లైటింగ్) కోసం ప్రధాన వనరు
  19. మరుగుదొడ్డి సౌకర్యం
  20. మరుగుదొడ్డి రకం
  21. మురుగునీటి పారుదల వ్యవస్థ
  22. స్నానపు గది సౌకర్యం
  23. వంటగది మరియు LPG/PNG కనెక్షన్ లభ్యత
  24. వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం
  25. రేడియో / ట్రాన్సిస్టర్
  26. టెలివిజన్ (TV)
  27. ఇంటర్నెట్ సౌకర్యం
  28. ల్యాప్‌టాప్ / కంప్యూటర్
  29. టెలిఫోన్ / మొబైల్ ఫోన్ / స్మార్ట్‌ఫోన్
  30. సైకిల్ / స్కూటర్ / మోటార్ సైకిల్ / మోపెడ్
  31. కారు / జీపు / వ్యాన్
  32. కుటుంబం ప్రధానంగా వినియోగించే ఆహార ధాన్యాలు
  33. మొబైల్ నంబర్ (కేవలం గణన సంబంధిత సమాచారం కోసం మాత్రమే)

గమనిక: ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ 2027 జనాభా గణనలోని మొదటి దశ (ఇళ్ల జాబితా మరియు గృహ గణన) కు సంబంధించింది. రెండో దశ (జనాభా లెక్కింపు) కు సంబంధించిన ప్రశ్నలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది.


Posted

in

by

Tags: