జన్మనిచ్చిన నిమిషాల్లోనే పసికందుపై కిరాతకం! డ్రైనేజీలో పడేసిన తల్లి.. రహస్య సంబంధం బయటపడుతుందనే భయంతోనే హత్య.. ప్రియుడితో కలిసి అరెస్టు

గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ జిల్లా, దేగాం తాలూకా పరిధిలోని అంగుతలా గ్రామంలో పుట్టిన కొద్ది నిమిషాల్లోనే ఓ పసికందును హత్య చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఈ ఘటనకు సంబంధించి చిన్నారి 21 ఏళ్ల తల్లితో పాటు, ఆమెతో సంబంధం ఉన్న 32 ఏళ్ల కలాజీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రైనేజీలో ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న పసికందును గమనించిన గ్రామస్థులు, వెంటనే దాన్ని బయటకు తీసి గాంధీనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది.

ఆ మహిళకు వివాహమై ఐదేళ్లయింది. భర్తతో తలెత్తిన విభేదాల కారణంగా గత ఏడాదిన్నరగా ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లోనే నివసిస్తోంది. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన కలాజీతో ఆమెకు పరిచయం ఏర్పడి, గత నాలుగేళ్లుగా ఇద్దరూ రహస్య సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కలాజీ కూడా తన భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు.

ఈ సంబంధం కారణంగా ఆ మహిళ గతంలోనే రెండుసార్లు గర్భం దాల్చగా, ఇద్దరూ కలిసి గర్భస్రావం చేయించుకున్నట్లు విచారణలో తేలింది. మూడోసారి గర్భం దాల్చినప్పుడు, ప్రారంభంలో అది ఆమెకు తెలియలేదు. ఆ తర్వాత కలాజీ అబార్షన్ మాత్రలు తెచ్చి ఇచ్చినప్పటికీ అవి పనిచేయలేదు. ఆసుపత్రికి వెళితే గర్భం విషయం కుటుంబ సభ్యులకు తెలిసిపోతుందనే భయంతో, తనకు వేరే ఆరోగ్య సమస్య ఉందని చెప్పి తల్లిదండ్రుల వద్ద ఆ విషయాన్ని దాచిపెట్టింది.

గత నవంబర్ 14 అర్ధరాత్రి ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. బాత్రూంకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె, గ్రామానికి దూరంగా ఉన్న పచ్చిక బయలు ప్రాంతానికి వెళ్లింది. అక్కడ కలాజీ సమక్షంలో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఏడవడం ప్రారంభించడంతో తమ రహస్య సంబంధం బయటపడుతుందనే భయంతో, ఆ పసికందు గొంతు నులిమి డ్రైనేజీలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో, పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *