జరీన్ ఖాన్ అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం ఎందుకు జరిగాయి? నోరు విప్పిన కుమారుడు జాయెద్.. ‘మేము ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు…’

గత ఏడాది జాయెద్ ఖాన్ తల్లి, మాజీ నటి జరీన్ ఖాన్ ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆ సమయంలో జాయెద్ ఖాన్ తన తల్లికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫోటోలు బయటకు రావడం ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాయెద్ ఖాన్ దీనిపై స్పందిస్తూ అసలు కారణాన్ని వెల్లడించారు.

మా ఇంట్లో ‘మానవత్వమే’ అతిపెద్ద మతం: ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాయెద్ ఖాన్ తన తల్లి చివరి కోరికను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఒక ముస్లిం కుటుంబంలో కోడలిగా ఉన్నప్పటికీ, ఆమె మూలాలు పార్సీ అయినప్పటికీ.. హిందూ పద్ధతిలో దహన సంస్కారాలు ఎందుకు చేశారన్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. “మా ఇంట్లో ‘ఇన్సానియత్’ (మానవత్వం) మాత్రమే అతిపెద్ద మతం. ఒక కుటుంబంగా మతం అనేది వ్యక్తిగత విషయమని మేము నమ్ముతాము. మేము చాలా సెక్యులర్ (లౌకిక) కుటుంబం, మేము ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? జరీన్ ఖాన్ చివరి కోరికను జాయెద్ బయటపెట్టారు. ఒకరోజు ఆమె ఒక నది ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు.. “నేను ఎప్పుడైనా చనిపోతే, నా అస్థికలను ఇదే నదిలో కలపాలి. నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను” అని తన మనసులో మాట చెప్పారు. తల్లి చివరి కోరిక ఏదైనా సరే, దానిని నెరవేర్చడమే తన బాధ్యత అని జాయెద్ అన్నారు. “వేరే వారు ఏమనుకున్నా, ఎంత ద్వేషాన్ని చిమ్మినా నాకు అనవసరం. పరిస్థితులు మారడానికి సమయం పడుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

జరీన్ ఖాన్ మరణం: గత ఏడాది నవంబర్ 7న జాయెద్ ఖాన్, సుసానే ఖాన్ తల్లి జరీన్ ఖాన్ 81 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. ఆమె పార్సీ కుటుంబంలో జన్మించినప్పటికీ, 1966లో నటుడు సంజయ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె 1963లో దేవ ఆనంద్‌తో కలిసి ‘తేరే ఘర్ కే సామ్నే’ అనే చిత్రంలో నటించారు. ఆమెకు భర్త సంజయ్, కుమారుడు జాయెద్, కుమార్తెలు సుసానే, ఫరా, సిమోన్ ఉన్నారు.


Posted

in

by

Tags: