జాగ్రత్త! ‘ప్రెగ్నెంట్ జాబ్’ పేరుతో భారీ మోసం.. ఆశపడితే జేబు ఖాళీ అవ్వడం ఖాయం!

బీహార్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కొత్త రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’ పేరుతో వస్తున్న ప్రకటనలను చూసి చాలా మంది తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు.

మోసం చేసే విధానం: సంతానం లేని మహిళలను గర్భవతిని చేస్తే రూ. 10 లక్షల వరకు పారితోషికం లేదా జీతం ఇస్తామంటూ ఈ ముఠా ప్రకటనలు ఇస్తోంది. ఒకవేళ సదరు మహిళ గర్భం దాల్చకపోయినా సరే, సగం డబ్బు ఇస్తామని నమ్మబలుకుతారు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రకటనలను ప్రచారం చేస్తూ, లైంగిక సంబంధం పేరుతో యువకులను ఆకర్షిస్తున్నారు.

డబ్బు ఎలా వసూలు చేస్తారు?:

  1. రిజిస్ట్రేషన్ ఫీజు: ఈ ప్రకటనలు చూసి ఎవరైనా సంప్రదిస్తే, మొదట ‘రిజిస్ట్రేషన్ ఫీజు’ పేరుతో కొంత డబ్బు వసూలు చేస్తారు.
  2. ఫోటోల ఎంపిక: ఆ తర్వాత నలుగురైదుగురు మహిళల ఫోటోలను పంపి, ఒకరిని ఎంచుకోమంటారు. ఫోటో సెలెక్ట్ చేయగానే, ఆ మహిళను కలవడానికి ‘సెక్యూరిటీ డిపాజిట్’ కట్టాలని అడుగుతారు.
  3. హోటల్ చార్జీలు: ఆపై హోటల్ బుకింగ్ అని, ట్రావెల్ ఖర్చులని ఏదో ఒక వంకతో బాధితుడు అది మోసమని గ్రహించే వరకు డబ్బులు గుంజుతూనే ఉంటారు.

పోలీసుల చర్యలు: బీహార్‌లోని నవాడా ప్రాంతంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షల రూపాయలు త్వరగా సంపాదించవచ్చనే ఆశతో చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు. అయితే, పరువు పోతుందనే భయంతో ఎక్కువ మంది బయటకు చెప్పడం లేదు. కొందరు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీస్ అధికారి అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మోసానికి సంబంధించి రంజన్ కుమార్ అనే వ్యక్తితో పాటు ఒక మైనర్‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కేవలం డబ్బు వసూలు చేయడమే కాకుండా, బాధితులను బ్లాక్ మెయిల్ చేసి మరింత డబ్బు గుంజుతున్నట్లు విచారణలో తేలింది.


Posted

in

by

Tags: